బరేలీ: భార్య పదే పదే చేస్తున్న హత్యాయత్నాల నుంచి ఓ భర్త మృత్యుంజయుడిగా తప్పించుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ, ఇజ్జత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన బాధితుడు రాజీవ్ ఇంట్లో ఉన్న సమయంలో ఆయనపై 11 మంది కర్రలు, ఐరన్ రాడ్లతో దాడి చేశారు. దాడికి పాల్పడిన వారిలో ఆయన భార్య సాధన, ఆమె సోదరులు ఐదుగురు ఉన్నారు. ఈ దాడిలో ఆయన కాళ్లు, చెయ్యి విరిగిపోయాయి. అనంతరం అతనిని సీబీ గంజ్‌లోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అక్కడ ఓ గొయ్యి తవ్వి, అందులో పూడ్చేయడానికి ప్రయత్నించారు.
అప్పుడు అకస్మాత్తుగా అక్కడికి ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. దుండగులందరినీ బెదిరించాడు. దీంతో వారంతా పారిపోయారు. అప్పుడు ఆయన బాధితుడిని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించాడు. తన భార్య తనపై హత్యాయత్నాలు చేయడం ఇదే మొదటిసారి కాదని రాజీవ్ పోలీసులకు చెప్పాడు. ఒకసారి తనకు విషం పెట్టి చంపేందుకు ప్రయత్నించిందని, మరోసారి ఓ గ్లాసును ముక్కలు చేసి, అన్నంలో కలిపి పెట్టిందని చెప్పాడు. ఆమె చేస్తున్న హత్యాయత్నాల గురించి ఆమె కుటుంబానికి చెప్పినా ఫలితం లేదని వాపోయాడు.