హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా జైళ్లలో ఖైదీల సంఖ్య గణనీయంగా పెరిగింది. అన్ని జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీల ఆక్యుపెన్సీ నమోదవుతున్నది. ఎలక్ట్రానిక్ ట్రాకర్స్ టెక్నాలజీని వాడటంతో ఖైదీల సంఖ్యను తగ్గించవచ్చని, తద్వారా జైళ్లలో ఖైదీల రద్దీని తగ్గించొచ్చని ‘సుప్రీంకోర్ట్ సెంటర్ ఫర్ రిసెర్చ్ అండ్ ప్లానింగ్’ నివేదిక వెల్లడించింది. చిన్న చిన్న నేరాలకు పాల్పడిన వారికి ఎలక్ట్రానిక్ ట్రాకర్స్‌ను అమర్చి జైలు సెలవులు మంజూరు చేయవచ్చని సూచించింది. ఎలక్ట్రానిక్ పరికరాలతో ఖైదీలను ట్రాకింగ్ చేసే విధానాన్ని మొదటిసారిగా ఒడిశా రాష్ట్రం ప్రతిపాదించింది. అధికారిక గణాంకాల ప్రకారం 31 డిసెంబర్ 2022 నాటికి దేశంలోని అన్ని జైళ్లలో 5,73,220 మంది ఖైదీలు ఉన్నారు. ఇది మొత్తం జైళ్ల సామర్థ్యంలో 131.4 శాతం.