న్యూఢిల్లీ: హెచ్-1బీ దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించి యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కొన్ని నిబంధనల్లో మార్పులు చేసింది. హెచ్-1బీ, హెచ్-1బీ1 ఫారం ఐ-129 పిటిషన్ల ఫైలింగ్ లొకేషన్‌ను సవరించింది. ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇకపై పేపర్ ఆధారిత దరఖాస్తులను సర్వీస్ సెంటర్లకు కాకుండా యూఎస్సీఐఎస్ లాక్బాక్స్ లొకేషన్లకు పంపాల్సి ఉంటుందని, లేకుంటే దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయని హెచ్చరించింది.
హెచ్-1బీ క్యాప్ దరఖాస్తులు పంపాల్సిన మెయిల్ అడ్రస్‌లు ఫారం ఐ-129 డైరెక్ట్ ఫైలింగ్ అడ్రసెస్ పేజీలో ఉంటాయని తెలిపింది. ఏప్రిల్ 1న, ఆ తర్వాతి నుంచి యూఎస్సీఐఎస్ సర్వీస్ సెంటర్ల వద్ద స్వీకరించిన హెచ్-1బీ, హెచ్-1బీ1 దరఖాస్తులను తిరస్కరిస్తామని, ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేసింది. మరోవైపు ఏప్రిల్ 1 నుంచి కొత్త హెచ్-1బీ ఫీజులను కూడా యూఎస్సీఐఎస్ అమలు చేయనున్నది.