న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 : భారత్‌లో పలు కార్యకలాపాలను యూఎస్ఏఐడీ నిధులు వెచ్చించినట్టు వస్తున్న సమాచారం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ‘యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవెలప్మెంట్(యూఎస్ఏఐడీ) కార్యకలాపాలు, నిధులకు సంబంధించి అమెరికా యంత్రాంగం బహిర్గతం చేసిన సమాచారం చూశాం. ఇది కచ్చితంగా తీవ్ర కలవరపాటుకు గురిచేసే అంశమే. భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యానికి సంబంధించి ఆందోళనలకు ఇది దారితీసింది. ఈ వ్యవహారాన్ని సంబంధిత విభాగాలు, ఏజెన్సీలు పరిశీలిస్తున్నాయి. ఇప్పుడే ఈ విషయంపై బహిరంగ వ్యాఖ్యలు చేయడం సరికాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, భారత్‌లో పోలింగ్‌ను పెంచేందుకు కేటాయించినట్టుగా డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం చెప్తున్న రూ.181 కోట్లు నిజానికి 2022లో యూఎస్ఏఐడీ బంగ్లాదేశ్ ఎన్నికల కోసం కేటాయించిందని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం ప్రచురించింది.
నిధులు బంగ్లాదేశ్‌కు వెళ్లాయనే వార్తలను బీజేపీ ఖండించింది. ట్రంప్ కంటే ఎక్కువగా ఈ వ్యవహారం ఎవరికీ తెలియదని, కావాలనే ఈ అంశాన్ని కప్పిపుచ్చేందుకు ఇలాంటి వార్తలు వస్తున్నాయని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సమయంలో భారత ప్రభుత్వానికి నిధులు ఆగిపోయి ఎన్జీవోలకు పెరిగాయి. లోక్‌సభ ఎన్నికల్లో మోదీని ఓడించే ప్రయత్నంలో భాగంగా ఎన్నికల ముందు రాహుల్ గాంధీని బలోపేతం చేసేందుకే ఈ నిధులు వచ్చాయి. రాహుల్ గాంధీ దేశద్రోహి. ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర లక్ష్యం.. భారత్‌ను ముక్కలు చేయడమే’ అని ఆరోపించారు. యూఎస్ఏఐడీ నిధులు బంగ్లాదేశ్‌కు వెళ్లాయనే వార్తల నేపథ్యంలో బీజేపీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ డిమాండ్ చేశారు.