వాషింగ్టన్, డిసెంబర్ 24: భారత్‌తోపాటు ఇతర దేశాల నుంచి అమెరికాకు వెళ్లే విద్యార్థులు, వృత్తి నిపుణులకు శుభవార్త. అంతర్జాతీయ విద్యార్థులు, కొన్ని రకాల తాత్కాలిక కార్మికులు సహా వలసేతర (నాన్-ఇమ్మిగ్రెంట్) వీసా దరఖాస్తుదారులకు కల్పించిన ఇంటర్వ్యూ మినహాయింపు సదుపాయాన్ని వచ్చే ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. తాత్కాలిక వ్యవసాయ, వ్యవసాయేతర కార్మికులు (హెచ్-2 వీసాలు), విద్యార్థులు (ఎఫ్, ఎం వీసాలు), అకడమిక్ ఎక్సేంజ్ విజిటర్ల (అకడమిక్ జే వీసాలు) క్యాటగిరీల వారు వ్యక్తిగత ఇంటర్వ్యూ మినహాయింపు సదుపాయాన్ని పొందేందుకు అర్హులని అమెరికా వెల్లడించింది. స్పెషాలిటీ ఆక్యుపేషన్స్ (హెచ్-1బీ), ట్రైనీ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ విజిటర్ (హెచ్-3 వీసాలు), ఇంట్రాకంపెనీ ట్రాన్స్ఫరీలు (ఎల్ వీసాలు), అసాధారణ ప్రతిభావంతులు (ఓ వీసాలు), క్రీడాకారులు, ఎంటర్టైనర్లు (పీ వీసాలు), అంతర్జాతీయ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాల్లో పాల్గొనేవారు (క్యూ వీసాలు), క్వాలిఫయింగ్ డెరివేటివ్ క్యాటగిరీల్లో నాన్-ఇమ్మిగ్రెంట్ తాత్కాలిక వర్క్ వీసాలకు ఆమోదించిన కొన్ని రకాల వ్యక్తిగత పిటిషన్ల లబ్ధిదారులు ఈ సదుపాయాన్ని పొందవచ్చు.