India Call Center : భారత్ కేంద్రంగా పనిచేస్తూ వృద్ధులను మోసం చేస్తున్న ఓ కాల్‌సెంటర్ (Call Center) కార్యకలాపాలను అమెరికాలో మూసివేయించారు. వందల మంది వృద్ధుల నుంచి మిలియన్ల కొద్దీ డాలర్లలో ఆ కాల్‌సెంటర్ దోచుకొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఏళ్లతరబడి దర్యాప్తు నిర్వహించిన ఎఫ్‌బీఐ (FBI).. ఐదుగురు టెలీమార్కెటింగ్ (Telemarketing) మోసగాళ్లపై దర్యాప్తు చేసి నేరాలను నిరూపించింది. ఈ మేరకు బుధవారం సోషల్ మీడియా (Social Media) లో బోస్టన్లోని ఎఫ్‌బీఐ విభాగం ఈ విషయాన్ని ప్రకటించింది.
మియామీకి చెందిన ఆడమ్ యంగ్, లాస్ వేగాస్‌కు చెందిన హారిసన్ గెవిర్ట్జ్ టెలీకమ్యూనికేషన్ సంబంధిత సేవలను అందించే ఓ కంపెనీని నడుపుతున్నారు. ఆ కంపెనీ కాల్ రూటింగ్, టెలిఫోన్ నంబర్స్, కాల్ ట్రాకింగ్, కాల్ ఫార్వర్డ్ సర్వీసులు అందించేది. ఆ సంస్థలో మోసాలు జరుగుతున్నట్లు యంగ్, హారిసన్లకు కూడా తెలుసు. ఈ మోసాలపై 2020లో దర్యాప్తు ప్రారంభమవగా ఐదుగురు భారతీయుల పేర్లు బయటకు వచ్చాయి. వారిలో సాహిల్ నారంగ్, చిరాగ్ సచిదేవ్, అబ్రార్ అన్జుమ్, మనీష్‌కుమార్ ఉన్నారు.
ఈ ఐదుగురు అమెరికన్లే లక్ష్యంగా భారత్ కేంద్రంగా టెలీమార్కెటింగ్ మోసాలకు పాల్పడుతున్నారు. వీరితోపాటు జగ్మీత్ సింగ్ విర్క్ అనే వ్యక్తి పైనా నేరం నిరూపణ అయినట్లు ఎఫ్‌బీఐ పేర్కొన్నది. అమెరికాలో ఉన్న భారత్‌కు చెందిన కాల్ సెంటర్లు యంగ్, హారిసన్ గెవిర్ట్జ్ సేవలను వాడుకొని మోసాలకు పాల్పడుతున్నాయని అధికారులు తెలిపారు.