న్యూఢిల్లీ : వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టుకు సహకరించే సమాచారం అందించిన వారికి 50 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 438 కోట్లు) ఇస్తామని అమెరికా ప్రకటించింది. అమెరికాలో డ్రగ్స్ వ్యాప్తిని, హింసను ప్రేరేపించేందుకు మదురో ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా జస్టిస్ అండ్ స్టేట్ డిపార్ట్మెంట్ (డీవోజే) ఈ ప్రకటన చేసింది.
విదేశీ ఉగ్రవాద సంస్థలైన ట్రెన్ డి అరాగ్యువా, సినలోవా, కార్టెల్ ఆఫ్ ద సన్స్ వంటి వాటి ద్వారా ప్రమాదకరమైన డ్రగ్స్‌ను దేశంలో ప్రవేశపెట్టడమే కాకుండా హింసను ప్రేరేపిస్తున్నాడని అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండీ ఆరోపించారు. మదురో, ఆయన సన్నిహితులకు చెందిన 30 టన్నుల కొకైన్‌ను డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ సీజ్ చేసింది. కాగా, ట్రంప్ మొదటిసారి గద్దెనెక్కినప్పుడు మదురో తలపై 15 మిలియన్ డాలర్ల రివార్డు ఉండేది. జోబైడెన్ హయాంలో ఇది 25 మిలియన్ డాలర్లకు పెరిగింది. ఇప్పుడు ట్రంప్ దీనిని డబుల్ చేస్తూ 50 మిలియన్ డాలర్లకు పెంచడం గమనార్హం.