NEET : దేశంలో అత్యంత కష్టమైన సివిల్స్ పరీక్షలు నిర్వహించే యూపీఎస్సీకి సంబంధించిన పేపర్లు ఒక్కసారి కూడా లీక్ కాలేదని, ఈ విషయంలో యూపీఎస్సీని చూసి నేర్చుకోవాలని ఎన్టీయే (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ)కి సుప్రీంకోర్టు సూచించింది. నీట్ యూజీ పేపర్ లీకేజీపై కోర్టు ఆగ్రహ వ్యక్తం చేసింది. అనేక దశల్లో తనిఖీలు, భద్రతా ప్రమాణాలు ఉన్నప్పటికీ నీట్ పేపర్ ఎలా లీకైందని కోర్టు ఎన్టీయేను ప్రశ్నించింది. ఈ అంశంపై అనేక పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధే ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ జరుపుతోంది.
ఎన్టీయేతోపాటు, ఇస్రో మాజీ చైర్మన్ డా.రాధాకృష్ణన్ ఆధ్వర్యంలోని ఉన్నతస్థాయి కమిటీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హాజరయ్యారు. ఎన్టీయే, రాధాకృష్ణన్ తరఫున సమర్పించిన అఫిడవిట్లను కోర్టు స్వీకరించింది. ఈ సందర్బంగా సమాధానం ఇచ్చేందుకు కేంద్రానికి కోర్టు సమయమిచ్చింది. కమిటీ సూచనల మేరకు నీట్ పరీక్షల నిర్వహణపై పర్యవేక్షణ ఎలా కొనసాగుతోదని కోర్టు ప్రశ్నించింది. పరీక్ష నిర్వహణలో ఇన్ని దశల రక్షణ ఉన్నప్పటికీ లీక్ ఎలా జరిగిందని ప్రశ్నించింది. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు తమ కమిటీ 101 సూచనలు చేసినట్లు రాధాకృష్ణన్ కోర్టుకు చెప్పారు.
వీటిలో 60 వరకు స్వల్పకాలిక సూచనలు అని, వీటిని గత ఏడాదినుంచే అమలు చేస్తున్నామన్నారు. ఇక, ఈ ఏడాది ఇంకొన్ని అమలయ్యాయన్నారు. మిగతా సూచనల్ని కూడా అమలు చేస్తామని చెప్పారు. ప్రశ్నాపత్రం రూపకల్పనలోనే పేపర్ లీకేజీ జరిగిందని రాధాకృష్ణన్ కోర్టుకు తెలిపారు. దీంతో ప్రశ్నాపత్రాల రూపకల్పనను కూడా పటిష్టం చేయాలని కోర్టు సూచించింది. మరోవైపు పేపర్ లీకేజీపై, విద్యార్థుల ఆవేదనపై కూడా కేంద్రానికి జవాబుదారీ తనం ఉండాల్సిందే అని కోర్టు అభిప్రాయపడింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతోకాలం పరీక్ష కోసం సన్నద్ధమవుతారని, వారి శ్రమను తక్కువ చేయకూడదని కోర్టు అభిప్రాయపడింది. అంతవరకు అసలు సమస్య ఆగదని, దేశ యువతను నిరాశపరచకూడదని కోర్టు వ్యాఖ్యానించింది.
దీనిపై తుషార్ మెహతా స్పందించారు. ఈసారి జరగబోయే పరీక్షను ప్రధాన మంత్రి నేరుగా పర్యవేక్షిస్తున్నారని, ప్రధాని కార్యాలయం నుంచే సూచనలు అందుతున్నాయని కోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణను జూలై 2వ వారానికి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.