న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలో అధికారుల పోస్టుల భర్తీకి పాత పద్ధతినే అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష (సీఎస్సీ), ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్ష (ఈఎస్సీ)ల ద్వారా రైల్వే అధికారులను ఎంపిక చేయనున్నది. ఈ నిర్ణయానికి కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం ఆమోదం తెలిపింది. ఐదేండ్ల క్రితం ఎనిమిది రైల్వే సేవలను ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (ఐఆర్ఎంఎస్)లో విలీనం చేసిన తరువాత అధికారుల పోస్టులన్నీ సీఎస్సీ పరీక్ష ద్వారానే భర్తీచేసేవారు. రైల్వేలో ప్రస్తుతం ఐఆర్ఎంఎస్లోని వివిధ విభాగాల్లో 225 ఖాళీలు ఉన్నాయి. సీఎస్సీ పరీక్ష ద్వారా జరిగే ఎంపికలో ఎక్కువ మంది సాంకేతికత లేని వారు భర్తీ అవుతుండటంతో సంస్థ అవసరాలు తీరడం లేదని తిరిగి పాత పద్ధతినే అనుసరించాలని రైల్వేశాఖ నిర్ణయించింది.