న్యూఢిల్లీ, జూలై 20: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) చైర్మన్ మనోజ్ సోనీ తన పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం. వ్యక్తిగత కారణాలతోనే ఆయన చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్టు అధికార వర్గాలు శనివారం వెల్లడించాయి. యూపీఎస్సీ చైర్మన్గా గత ఏడాది మేలో బాధ్యతలు చేపట్టిన మనోజ్ సోనీ.. పదవీ కాలం 2029 మే వరకు ఉండగానే రాజీనామా చేయడం గమనార్హం. ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం తర్వాత యూపీఎస్సీని వివాదాలు, పలు ఆరోపణలు చుట్టుముట్టిన నేపథ్యంలో మనోజ్ సోనీ రాజీనామా అంశం ప్రాధాన్యం సంతరించుకొన్నది. అయితే తన రాజీనామాకు ఖేద్కర్ వివాదానికి ఎలాంటి సంబంధం లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆయన రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదని తెలిపాయి.
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర వివాదం రేపింది. నకిలీ పత్రాలు, పేర్ల మార్పుతో మోసం చేసి ఆమె పరిమితికి మించి సివిల్స్ పరీక్ష రాసినట్టు తేలడంతో ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు యూపీఎస్సీ శుక్రవారం వెల్లడించింది. రాజ్యాంగ సంస్థలను దెబ్బతీస్తున్న బీజేపీ యూపీఎస్సీ చైర్మన్ రాజీనామాపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్పందించింది. యూపీఎస్సీని పలు కుంభకోణాలు కుదిపేశాయని, ఇది జాతీయస్థాయి ఆందోళకర అంశమని తెలిపింది. దేశంలోని రాజ్యాంగ సంస్థల ప్రతిష్ఠ, సమగ్రత, స్వతంత్రతను దెబ్బతీయడం ద్వారా ఆయా సంస్థలను బీజేపీ-ఆరెస్సెస్ తన చేతుల్లోకి తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.