న్యూఢిల్లీ, ఆగస్టు 18: నగదు రహిత డిజిటల్ లావాదేవీలకు వీలుకల్పిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వ్యవస్థను విప్లవాత్మక రీతిలో అప్‌గ్రేడ్ చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కసరత్తు చేస్తున్నది. ‘యూపీఐ 3.0’గా పిలిచే ఈ అప్‌గ్రేడ్ ఐవోటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) ఎనేబుల్డ్‌గా ఉండటంతోపాటు అన్ని రకాల స్మార్ట్ డివైజ్‌ల ద్వారా ఆటోమేటెడ్ చెల్లింపులకు వీలుకల్పిస్తుంది. అంటే, ఇకపై మనం యూపీఐ లావాదేవీల కోసం కేవలం స్మార్ట్ఫోన్లపైనే ఆధారపడాల్సిన అవసరం ఉండదు. యూపీఐ ఆటోపే, యూపీఐ సర్కిల్ లాంటి ప్రస్తుత ఫీచర్ల సామర్థ్యాలతో కొత్త వ్యవస్థ పనిచేస్తుంది.
ఐవోటీ ఆధారిత యూపీఐ లావాదేవీలు
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది విస్తృతంగా ఉపయోగించే కనెక్షన్, డాటా ఎక్సేంజ్ టెక్నాలజీ. ఇది సాఫ్ట్వేర్లు లేదా సెన్సర్లతో ఇంటర్నెట్కు అనుసంధానమైన డివైజ్‌ల మధ్య కమ్యూనికేషన్, ఇంటరాక్షన్‌కు వీలుకల్పిస్తుంది. తద్వారా మానవ ప్రమేయం లేకుండానే స్మార్ట్‌వాచ్‌లు, టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, కార్లు లాంటి స్మార్ట్ డివైజ్‌ల ద్వారా యూపీఐ చెల్లింపులు జరుపుకోవచ్చు. నెలవారీ సబ్స్క్రిప్షన్ల లాంటి సేవలకు సంబంధించిన ఆటోమేటెడ్ చెల్లింపులను స్మార్ట్ డివైజ్‌ల నుంచి చేసేందుకు వీలుకల్పిస్తుంది.
అక్టోబర్‌లో అధికారిక ప్రకటన
యూపీఐ అప్‌గ్రేడ్‌కు ఇంకా రెగ్యులేటరీ అనుమతులు లభించలేదు. దీంతో ఈ అప్‌గ్రేడ్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2025’లో వెలువడే అవకాశం ఉన్నది. అక్టోబర్‌లో జరిగే ఈ ఈవెంట్‌కు ముంబై ఆతిథ్యమివ్వనున్నది. ‘యూపీఐ 3.0’ అందుబాటులోకి రాగానే వినియోగదారులు తమ ప్రధాన యూపీఐ డివైజ్ నుంచి స్మార్ట్ డివైజ్‌కు ఆదేశం (మ్యాండేట్) ఇచ్చేందుకు వీలవుతుంది. కొన్ని పరిమితులకు లోబడి ఆటోమేటెడ్ లావాదేవీలు జరుపుకునేందుకు వీలవుతుంది.
నిరుడు 18,580 కోట్ల లావాదేవీలు
గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో యూపీఐ ద్వారా 18,580 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇవి 2023-24లో జరిగిన లావాదేవీల సంఖ్య కంటే ఏకంగా 41.7% అధికం. నిరుడు భారత్‌లో 83% రిటైల్ చెల్లింపులు యూపీఐ ద్వారానే జరిగినట్టు రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నివేదిక వెల్లడించింది.