న్యూఢిల్లీ: వ్యాపారవేత్త సుశీల్ అన్సల్, గోపాల్ అన్సల్కు ఏడేళ్ల జైలుశిక్ష ఖరారైంది. 1997లో ఉపహార్ సినిమా థియేటర్లో జరిగిన అగ్ని ప్రమాదం కేసులో ఆ ఇద్దరూ దోషులుగా ఉన్నారు. అయితే ఆ ఇద్దరూ తప్పుడు పత్రాలను సమర్పించిన నేపథ్యంలో వారికి కోర్టు ఏడేళ్ల శిక్ష విధించింది. ఉపహార్ థియేటర్ ప్రమాదంలో 59 మంది మరణించిన విషయం తెలిసిందే. ఢిల్లీకి చెందిన పాటియాలా హౌజ్ కోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. బడా వ్యాపారవేత్తలైన అన్సల్ సోదరులకు 2.25 కోట్ల జరిమానా కూడా కోర్టు విధించింది.
సుశీల్, గోపాల్ అన్సల్లు సాక్ష్యాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఆ కేసులో నెల క్రితం ఇద్దర్ని దోషులుగా తేల్చారు. అయితే ఇవాళ తీర్పును వెలువరించారు. గతంలో ఇదే కేసులో అన్సల్ సోదరులిద్దరికీ సుప్రీం రెండేళ్ల శిక్ష వేసింది. ఆ ఇద్దరూ చెరో 30 కోట్లు చెల్లించి విడుదలయ్యారు. ఆస్పత్రి నిర్మాణం కోసం ఆ డబ్బులు వాడనున్నారు. ఇక ఉపహార్ థియేటర్ విషాదం ఘటనలో నిందితులైన హరస్వరూప్ పన్వార్, ధరమ్వీర్ మల్హోత్రాలు కేసు విచారణ సమయంలో మరణించారు.