న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా జడ్జి.. తనకు సుఖమైన చావు కల్పించాలని కోరుతూ.. సుప్రీంకోర్టు(Supreme Court) సీజే డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. సీనియర్లు తనను లైంగికంగా వేధిస్తున్నారని, అందుకే తాను హుందాగా చనిపోయే అవకాశాన్ని కల్పించాలని కోరుతూ ఆ లేఖలో వేడుకున్నారు. సోషల్ మీడియాలో ఆ లేఖ వైరల్ అయ్యింది. ఈ అంశంపై సీజే చంద్రచూడ్ స్పందించారు. బందాకు చెందిన ఓ మహిళా జడ్జి ఆ లేఖను రాశారు. బారాబంకికి చెందని జిల్లా జడ్జి వేధిస్తున్నట్లు ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. అన్ని రకాలుగా తనను వేధిస్తున్నారని, ఓ చెత్తకుండిలా తనను చూస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.
సీజే చంద్రచూడ్ ఆదేశాల ప్రకారం.. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అతుల్ ఎం ఖురేఖర్..అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు లేఖ రాశారు. మహిళా జడ్జి ఇచ్చిన ఫిర్యాదుపై వీలైనంత త్వరగా రిపోర్టు ఇవ్వాలని సీజే ఆదేశించారు. హైకోర్టు తాత్కాలిక జడ్జి ఆ లెటర్ గురించి ఆరా తీస్తున్నారు. తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జూలైలో విచారణ చేపట్టారని, కానీ ఆ ఎంక్వైరీలో ఏమీ తేలలేదని ఆ మహిళా జడ్జి తన లేఖలో పేర్కొన్నారు. సమగ్ర విచారణ కోసం జిల్లా జడ్జిని ట్రాన్స్ఫర్ చేయాలని ఆ మహిళ తన లేఖలో కోరారు. కానీ ఆ పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది.
తనకు ఇక జీవించాలని లేదని, గత ఏడాది కాలం నుంచి తానో శవంలా జీవిస్తున్నాని, జీవం లేని ఈ శరీరాన్ని ముందుకు తీసుకువెళ్లడం ఇక లాభం లేదని, నా జీవితానికి ఎటువంటి అర్థం లేదని ఆమె లేఖలో తెలిపారు.