లక్నో: వాహనంలో పెట్రోల్ కోసం బంకు వద్దకు వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేను అక్కడున్న ఒక వ్యక్తి వినూత్న కోరిక కోరాడు. తాను పెళ్లి చేసుకునేందుకు వధువును చూడాలని అభ్యర్థించాడు. ఆ ఎమ్మెల్యేకు తాను ఓటు వేశానని, అందుకే ఈ సహాయం కోరుతున్నానని అన్నాడు. (Pump Attendant’s Unusual Request To MLA) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చర్ఖారీ ఎమ్మెల్యే బ్రిజ్‌భూషణ్ రాజ్‌పుత్ ప్రయాణించిన కారు ఇంధనం కోసం మహోబాలోని పెట్రోల్ బంక్ వద్ద ఆగింది. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న అఖిలేంద్ర ఖరే ఆ ఎమ్మెల్యే వద్దకు వెళ్లాడు. ఆయనను అసాధారణ కోరిక కోరాడు. తనకు 45 ఏళ్లు వస్తున్నాయని, అయినా పెళ్లి కాలేదని చెప్పాడు. ఈ నేపథ్యంలో వధువును వెతికేందుకు సహాయం చేయాలని అడిగాడు.
కాగా, వధువు కోసం తనను ఎందుకు అడుగుతున్నావని బీజేపీ ఎమ్మెల్యే బ్రిజ్‌భూషణ్ రాజ్‌పుత్ ప్రశ్నించారు. ‘మీకు నేను ఓటు వేశా, అందుకే సహాయం కోరుతున్నా’ అని అఖిలేంద్ర ఠక్కున సమాధానం ఇచ్చాడు. అలాగే తనకు కులాల పట్టింపు ఏమీ లేదని చెప్పాడు.
మరోవైపు అతడి జీతం గురించి ఆ ఎమ్మెల్యే అడగ్గా నెలకు ఆరు వేలు సంపాదిస్తున్నట్లు అఖిలేంద్ర తెలిపాడు. అయితే తనకు 13 ఎకరాల భూమి కూడా ఉందని చెప్పాడు. దీంతో అతడి ఆస్తి విలువ కోట్లలో ఉంటుందని ఎమ్మెల్యే బ్రిజ్‌భూషణ్ రాజ్‌పుత్ అన్నారు. అలాగే వధువును వెతికేందుకు తాను తప్పకుండా సహాయం చేస్తానని అఖిలేంద్రకు హామీ ఇచ్చారు. వారిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#महोबा l पेट्रोल पंप कर्मी ने #BJP विधायक से सिफारिश की। MLA बृजभूषण राजपूत से शादी कराने की सिफारिश की। बृजभूषण राजपूत ने पेट्रोल कर्मी को दिया आश्वासन। हमने आपको वोट दिया था हमारी शादी करवाओ- रिंकू pic.twitter.com/FhiNFOU1Nd
— Danish Khan (@Danishk77853628) October 16, 2024