UP Police | లక్నో : కొత్త చట్టాలపై స్టేషన్ హౌజ్ ఆఫీసర్లకు ఎంత పరిజ్ఞానం ఉందో తెలుసుకునేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త ప్రయోగం చేపట్టింది. జిల్లాల వారీగా పోలీసులకు రాత పరీక్షలు నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో బాగ్పత్ జిల్లాలోని ఎస్‌హెచ్‌వోలకు జిల్లా ఎస్పీ సూరజ్ కుమార్ రాయ్ రాత పరీక్షలు నిర్వహించారు.
ఈ రాత పరీక్షలకు 260 మంది ఎస్‌హెచ్‌వోలు హాజరయ్యారు. 75 ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రాన్ని రూపొందించి పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు గంట సమయం కేటాయించారు. కొత్త చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియంకు సంబంధించి ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా ఫోరెన్సిక్, సైబర్ క్రైమ్, ఔట్ డోర్ పోలీసింగ్, డ్రాఫ్టింగ్‌కు సంబంధించి ప్రశ్నలు సంధించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ రాయ్ మాట్లాడుతూ.. పోలీసుల నాలెడ్జిని పరిశీలించేందుకు పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. చాలా మంది పోలీసులకు కొత్త చట్టాలపై అవగాహన లేదన్నారు. ఈ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించిన పోలీసులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పరీక్షలు రాసిన వారిలో 42 మంది మహిళా పోలీసులు ఉన్నారు. డీజీపీ రాజీవ్ కృష్ణ ఆదేశాల మేరకు పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఇలాంటి పరీక్షలు తరచుగా నిర్వహిస్తామని ఎస్పీ రాయ్ పేర్కొన్నారు.