UP | ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయం దగ్గరపడింది. అందులో యూపీపైనే అందరి ఫోకస్. అందరి దృష్టీ యూపీపైనే. అందునా ముఖ్యమంత్రి యోగియే ఇప్పుడు అందరి టార్గెట్ కూడా. కేవలం ప్రతిపక్షాల టార్గెట్ అయితే సర్వ సాధారణమే. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా టార్గెట్ కూడా యోగియేనా? ఇప్పుడు యూపీ అంతటా ఇదే చర్చ. ఇన్ని రోజుల పాటూ యోగి విషయంలో మోదీ,షా ద్వయం సాఫ్ట్ కార్నర్ గా ఉంటూ వచ్చినా, ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. తమ పాచికలను ఒక్కసారిగా బయటికి తీస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. బీజేపీ తిరిగి యూపీలో అధికార పగ్గాలు చేపడితే.. యోగికి బదులుగా మోదీకి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారా? మాజీ ఎంపీ హరినారాయణ్ రాజ్‌భర్ చేసిన వ్యాఖ్యలు దీనికి ఊతమిస్తున్నాయా?
బీజేపీ మాజీ ఎంపీ, యూపీ సీనియర్ నేత హరినారాయణ్ రాజభర్ ఒక్క సారిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీ తదుపరి ముఖ్యమంత్రిగా యూపీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఏకే శర్మ అన్నట్లు రాజ్‌భర్ వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. యోగి విషయంలో బీజేపీ కేడర్ పూర్తి అసంతృప్తితో ఉన్నారని, రెండోసారి యోగి సీఎం అయ్యే ఛాన్సే లేదని ఈయన వ్యాఖ్యలు బలపరుస్తున్నాయని యోగి వ్యతిరేక శిబిరం అంటోంది. బీజేపీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఏకే శర్మను ముఖ్యమంత్రి చేయడానికి సర్వశక్తులూ ఒడ్డుతా. మీరు కూడా ఆయన్ను ముఖ్యమంత్రి చేయడానికి అహోరాత్రాలూ శ్రమించండి. రాష్ట్రం శ్రేయస్సు దృష్ట్యా ఏకే శర్మ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏకే శర్మ పేరును బీజేపీ అధిష్ఠానం పరిగణనలోకి తీసుకోవాల్సిందే అని రాజ్‌భర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ముఖ్యమంత్రి యోగికి, ప్రధాని మోదీకి సరిగ్గా పొసగడం లేదని ఎప్పటి నుంచో ఉన్న వాదన. బీజేపీలో మోదీకి ఉన్న ప్రభకు సమాంతరంగా యోగి కూడా ఎదిగిపోతున్నారన్న విమర్శ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే యూపీలో తన నీడ ఉండాలని మోదీ ఎప్పటి నుంచో ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. మోదీ అనుకున్నట్లు కథ సుఖాంతంగా నడవడానికి ఏకే శర్మను మోదీ ఎంచుకున్నారు. అంతేకాకుండా యూపీలోని బ్రాహ్మణ వర్గం సీఎం యోగిపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో అటు పార్టీ క్షేమం కోసం, ఇటు తన పట్టు నిలుపుకోవడం కోసం కొన్ని రోజులు క్రితమే ఏకే శర్మను ప్రధాని మోదీ రంగంలోకి దింపారు. కొన్ని రోజుల క్రిందటే ఏకే శర్మ బీజేపీలో చేరారు. చేరడం చేరడమే అత్యంత కీలకమైన రాష్ట్ర ఉపాధ్య పదవిని చేపట్టారు. ఏకంగా ఎమ్మెల్సీ కూడా అయ్యారు. ఏకే శర్మ చేరిపోవడంతోనే అంత ప్రాధాన్యం లభించిందంటే ఏదో ఉండే ఉంటుందని యోగి శిబిరం భావించింది. యోగి శిబిరం అనుమానిస్తున్నట్లే తాజాగా మాజీ ఎంపీ హరినారాయణ్ రాజ్‌భర్ వ్యాఖ్యలున్నాయి.
యోగి ఆదిత్యనాథ్ పాలనపై బ్రాహ్మణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. యోగి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తమపై కక్ష గట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. 59 మంది మంత్రుల్లో 9 మంది బ్రాహ్మణ వర్గానికి చెందిన వారున్నా… అందులో ముగ్గురికే ప్రాధాన్యత గల శాఖలిచ్చారని, మిగతా వారికి అంత ప్రాధాన్యత లేని శాఖలిచ్చారని బ్రాహ్మణ వర్గీయులు విమర్శలకు దిగారు. యూపీ రాజకీయాలను తాము శాసిస్తున్నా, యోగి మాత్రం తమను పట్టించుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బ్రాహ్మణ్ సత్తా బనాతా హై.. గిరాతాహై యూపీమే.. ఏ చునావీ ఇతిహాస్ రహాహై’ (బ్రాహ్మణులే ప్రభుత్వాలను గద్దెనెక్కిస్తారు.. దించేస్తారు.. ఇది యూపీ చరిత్ర) అంటూ బ్రాహ్మణ వర్గం నేత అసీం పాండే కొన్ని రోజుల క్రితం వ్యాఖ్యానించారు.
ఈ మధ్యే బ్రాహ్మణ నేతలు సమాజ్‌వాదీ పార్టీలో కూడా చేరిపోయారు. అయితే ఈ విషయాన్ని మోదీ, షా ద్వయం కొన్ని రోజుల క్రిందటే పసిగట్టి, యాక్టివ్ అయ్యారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల ముఖ్య కార్యదర్శి బి.ఎల్. సంతోశ్ ద్వారా ఏకే శర్మను బీజేపీలో చేర్చుకున్నారు. ముఖ్యమైన పదవులిచ్చారు. ఏకే శర్మ మాధ్యమంగా తిరిగి బీజేపీకి జవసత్వాలు నింపాలని, యోగిని దెబ్బతీయాలని మోదీ,షా వ్యూహం రచించారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
ఏకే శర్మ.. పూర్తి పేరు అరవింద్ కుమార్ శర్మ. యూపీలోని మావూ స్వస్థలం. గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి. 1988 బ్యాచ్ అధికారి. అత్యంత సమర్థుడిగా బాధ్యతలు నిర్వహిస్తారని పేరు గడించారు. అలాగే గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ బాధ్యతల్లో ఉన్నప్పటి నుంచీ ఆయనకు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. నరేంద్ర మోదీతో 20 సంవత్సరాల పాటు పనిచేశారంటే… ఆయనకు ఎంత సన్నిహితుడితో అర్థం చేసుకోవచ్చు.
మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుజరాత్లో అత్యంత ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలకు నేతృత్వం వహించి… గుజరాత్‌కు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టారు. ఈ బ్యాక్‌గ్రౌండే తదనంతర కాలంలో ఏకే శర్మను పీఎంవోకి చేరువ చేశాయి. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏకే శర్మ పీఎంవోలో అత్యంత కీలకంగా వ్యవహరించారు. పీఎంవో జాయింట్ సెక్రెటరీగా ఉంటూ ప్రధాని మోదీకి తలలో నాలుకలా వ్యవహరించారు. ప్రధాని మోదీ తీసుకునే ప్రతి కీలక నిర్ణయంలోనూ ఏకే శర్మ ఉండేవారని అంటారు. చివరికి యూపీలో కరోనా తీవ్రంగా ప్రబలిన సమయంలోనూ మోదీ ఏకే శర్మను అక్కడికి పంపించారు. కరోనా కట్టడిలో ఏకే శర్మ కీలక పాత్ర పోషించారు.