లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన జనసత్తా దళ్ (లోక్తాంత్రిక్) అధ్యక్షుడు, కుంట ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ తండ్రి ఉదయ్ ప్రతాప్ సింగ్‌ను పోలీసులు గృహ నిర్బంధంలో (house arrest) ఉంచారు. మొహర్రం నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా ఉదయ్ ప్రతాప్ మద్దతుదారులను కూడా గృహ నిర్బంధం చేశారు. జూలై 17 రాత్రి 9 గంటల వరకు 68 గంటల పాటు వారి గృహ నిర్బంధం కొనసాగుతుందని పోలీస్ అధికారి తెలిపారు.
కాగా, రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ ‘రాజా భయ్యా’ ప్రతాప్‌గఢ్ జిల్లాలోని కుంట అసెంబ్లీ స్థానం నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే కొన్నేళ్ల కిందట షేక్‌పూర్ ఆషిక్లోని మొహర్రం ఊరేగింపు సందర్భంగా కోతి మరణించింది. కోతి చనిపోయిన వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే రాజా భయ్యా తండ్రి ఉదయ్ ప్రతాప్ సింగ్, ఆయన మద్దతుదారులు మొహర్రం రోజున విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు.
మరోవైపు మొహర్రం సందర్భంగా నగరంలో శాంతి భద్రతల దృష్ట్యా ఉదయ్ ప్రతాప్ సింగ్, 12 మంది మద్దతుదారులను గృహ నిర్బంధంలో ఉంచాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దీంతో ఉదయ్ ప్రతాప్ నివాసమైన భద్రి కోఠి ప్రధాన ద్వారం వద్ద నోటీసులు అంటించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అలాగే గృహ నిర్బంధంలో ఉన్న వారి ఇళ్ల వద్ద పోలీస్ బలగాలను మోహరించామని, వారి కార్యకలాపాలపై నిఘా ఉంచినట్లు వెల్లడించారు.