లక్నో: రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి చనిపోయినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. పోస్ట్‌మార్టం కోసం బాడీని మార్చురీ ఫ్రీజర్‌లో ఉంచగా మరునాడు అతడు బతికి ఉన్నట్లు బంధువులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఈ ఘటన జరిగింది. 45 ఏండ్ల శ్రీకేష్ కుమార్‌ను గురువారం బైక్ ఢీకొట్టింది. పరిస్థితి సీరియస్‌గా ఉన్న అతడ్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన అక్కడి వైద్యుడు శ్రీకేష్ మరణించినట్లు తెలిపారు. అతడు రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాత్రి కావడంతో అక్కడి మార్చురీలోని ఫ్రీజర్‌లో బాడీని ఉంచారు.
శుక్రవారం పోస్ట్‌మార్టం కోసం సంబంధిత పత్రాలపై సంతకాల నిమిత్తం పోలీసులు, బంధువులు వచ్చి చూడగా శ్రీకేష్ కుమార్ శ్వాస తీసుకోవడాన్ని గుర్తించారు. సుమారు ఆరు గంటలు మార్చురీలోని ఫ్రీజర్‌లో ఉన్న అతడు బతికే ఉన్నాడని గ్రహించారు. దీంతో ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు.
అయితే శ్రీకేష్ ఇంకా కోమాలోనే ఉన్నాయని వైద్యులు తెలిపారు. కాగా, అతడు మరణించాడని ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు ఎలా పొరపడి ధ్రువీకరించారో అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.