లక్నో, జనవరి 13: ‘ఇదిగోండి సార్.. ఇదే నా చేతిపై కాటు వేసింది’ ఒక వ్యక్తి జేబులోంచి అడుగున్నర పామును బయటకు తీయడం చూసి ఒక డాక్టర్ బెంబేలెత్తాడు. ఈ ఘటన యూపీలోని ఒక జిల్లా దవాఖానలో మంగళవారం జరిగింది. ‘ఈ రిక్షా’ డ్రైవర్ అయిన దీపక్ (39).. దవాఖానకు వచ్చి తనను ఒక పాము కాటు వేసిందని, యాంటీ వీనమ్ ఇంజెక్షన్ చేయాలంటూ డాక్టర్ను కోరాడు. నిన్ను ఏ పాము కాటేసిందని డాక్టర్ అడగగానే వెంటనే అతడు జేబులోంచి ఆ పామును తీసి డాక్టర్ కళ్ల ముందు ఉంచాడు. దీంతో బెంబేలెత్తిన డాక్టర్ ‘ముందు ఆ పామును బయటకు వదిలేయ్.. ఇక్కడ ఉంటే మిగతా రోగులకు ఇబ్బంది’ అని అన్నా ఆ వ్యక్తి విన్పించుకోలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆ పామును అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరలైంది.