Uttar Pradesh | లక్నో : ఉత్తరప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో ఖైదీలు మెరిశారు. 95 శాతం ఉత్తీర్ణత సాధించారు. 12వ తరగతి ఫలితాల్లో 70 శాతం ఉత్తీర్ణత సాధించారు ఖైదీలు. జైళ్ల శాఖ వివరాల ప్రకారం.. ఇటీవల జరిగిన యూపీ పది పరీక్షలకు 60 మంది ఖైదీలు హాజరు కాగా, 57 మంది పాసయ్యారు. వీరిలో కొందరు ప్రథమ శ్రేణి మార్కులు సాధించారు. 12వ తరగతి పరీక్షలకు 64 మంది ఖైదీలు హాజరు కాగా, 45 మంది ఉత్తీర్ణత సాధించారు. 16 మంది ఖైదీలు ఫస్ట్ డివిజన్ మార్కులను సాధించారు.
ఈ సందర్భంగా జైళ్ల శాఖ అధికారులు మాట్లాడుతూ.. పలు కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు 10, 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఖైదీలు మంచి ఫలితాలు సాధించారు. తమ జైళ్ల పరిధిలోనే ఎగ్జామినేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా విద్యాశాఖ అధికారులకు సహకారం అందించామని తెలిపారు. మొత్తం 10 జైళ్లల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఖైదీలకు కావాల్సిన పుస్తకాలు సమకూర్చి, చదువుకునే వాతావరణాన్ని కల్పించామని చెప్పారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో ఖైదీలకు ఎలాంటి వర్క్ కేటాయించకుండా, చదువునపై ధ్యాస పెట్టేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.