UP FARMERS| లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సర్కారుపై అక్కడి రైతులు భగ్గుమంటున్నారు. బోరుబావులకు ఉచిత విద్యుత్తు అందిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన యోగి సర్కారు.. తర్వాత ఆ ఊసే ఎత్తకపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా బోరుబావులకు ప్రభుత్వం విద్యుత్తు మీటర్లు బిగిస్తుండటంపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. యోగి సర్కారు మోసపూరిత వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. విద్యుత్తు మీటర్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా కిసాన్ సభ, భారతీయ కిసాన్ యూనియన్ ఇప్పటికే ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. తమ డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించకపోతే రైల్వే ట్రాకులను దిగ్బంధిస్తామని రైతులు హెచ్చరించారు.
తమ అనుమతి లేకుండానే అధికారులు విద్యుత్తు మీటర్లు బిగుస్తున్నారని అన్నదాతలు చెబుతున్నారు. మీటర్ల బిగింపు సందర్భంగా బిజ్నోర్‌లో అధికారులతో రైతులు వాగ్వివాదానికి దిగారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వారు వెనక్కి తగ్గారు. హార్స్‌పవర్‌కు రూ.185 చొప్పున తాము బిల్లు చెల్లిస్తున్నామని, అదే హర్యానాలో రూ.35 వసూలు చేస్తున్నారని రైతులు తెలిపారు. గ్రామాల్లో అరకొరగానే విద్యుత్తును సరఫరా చేస్తున్నారని, మీటర్లు బిగిస్తే విద్యుత్తు బిల్లు తడిసి మోపెడవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. బోరుబావులకు విద్యుత్తు మీటర్లు బిగించడాన్ని ఏ ఒక్క రైతూ అంగీకరించబోరని రైతు నాయకుడు సుఖ్దీప్ తోమర్ స్పష్టంచేశారు.
ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (యూపీపీసీఎల్) గత ఏడాది మేలో విద్యుత్తు మీటర్ల బిగింపు ప్రక్రియను ప్రారంభించింది. ఈ ఏడాది ఆగస్టు నాటికి అన్ని బోరుబావులకు మీటర్ల బిగింపును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ఈ ప్రక్రియ ఆలస్యమవుతున్నది. మీటర్ల బిగింపు సందర్భంగా రైతులు కొన్నిసార్లు యూపీపీసీఎల్ అధికారులను నిర్బంధించిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. అలాగే మీటర్లను పీకేసి విద్యుత్తు కార్యాలయంలో పడేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. గత జూన్‌లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన వందలాది మంది రైతులు పీవీవీఎన్‌ఎల్ ప్రధాన కార్యాలయం వద్ద బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.