UP Civic Election | ఉత్తరప్రదేశ్‌లో పౌర ఎన్నికలకు సంబంధించి హైకోర్టు లక్నో బెంచ్ కీలక నిర్ణయం ప్రకటించింది. ఈ నిర్ణయంతో యూపీలో ఓబీసీ రిజర్వేషన్ లేకుండానే మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది. ట్రిపుల్ టెస్ట్ లేని వరకు ఓబీసీ రిజర్వేషన్ ఉండదని, ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్ లేకుండానే ఎన్నికలు నిర్వహించాలని కోర్టు సూచించింది. ఇప్పుడు ఓబీసీకి రిజర్వ్ చేసిన అన్ని స్థానాలు జనరల్‌గా పరిగణిస్తారు. మున్సిపల్ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని కూడా ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో పౌర ఎన్నికల కోసం జారీ చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది.
యూపీ సివిక్ బాడీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు లక్నో బెంచ్ మంగళవారం 70 పేజీల తీర్పును వెలువరించింది. ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద దెబ్బగా పరిశీలకులు భావిస్తున్నారు. ఓబీసీ రిజర్వేషన్ లేకుండానే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు లక్నో బెంచ్ ఆదేశించింది. ఈ అంశంపై దాఖలైన 93 పిటిషన్లపై జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్, జస్టిస్ సౌరభ్ లావానియాతో కూడిన డివిజన్ బెంచ్ విచారించి ఈ తీర్పును వెలువరించింది. డిసెంబర్ 12న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను కూడా హైకోర్టు తిరస్కరించింది. దీని ద్వారా పదవీకాలం త్వరలో పూర్తి కానున్న స్థానిక సంస్థల్లో అడ్మినిస్ట్రేటర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఓబీసీ కోటా రిజర్వేషన్లను నిర్ణయించడంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ట్రిపుల్ టెస్ట్ ఫార్ములాను యూపీ ప్రభుత్వం అనుసరించలేదని ప్రాథమికంగా కనిపిస్తున్నదని హైకోర్టు పేర్కొన్నది. వైభవ్ పాండే దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విషయంలో వైభవ్ పాండేతో పాటు పలువురు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ ఏడాది సురేశ్ మహాజన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లు జారీ చేసే ముందు ట్రిపుల్ టెస్ట్ నిర్వహించాలని స్పష్టంగా ఆదేశించిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు.