లక్నో: పాకిస్థాన్ కోసం గూఢచర్యం (Spying For Pak) చేస్తూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త పోలీసులకు చిక్కాడు. పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) కోసం పనిచేస్తున్న యూపీలోని రాంపూర్‌కు చెందిన వ్యాపారవేత్త షాజాద్‌ను (Shahzad) స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు (STF) అరెస్టు చేశారు. గూఢచర్యంతోపాటు పాక్‌కు స్మగ్లింగ్ (Smuggling) చేస్తున్నాడనే సామాచారంతో అతని కదలికలపై ఓ కన్నేసిన ఎస్టీఎఫ్ పోలీసులు.. అతడిని మొరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. పాక్ నిఘా సంస్థ కోసం అతడు గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. జాతీయ భద్రతకు సంబంధించిన సున్నిత సమాచారాన్ని కూడా ఐఎస్ఐకి చేరవేసినట్లు అధికారులు తెలిపారు. సమాచారాన్ని పంచుకునేందుకు పలుమార్లు పాక్‌కు వెళ్లివచ్చినట్లు గుర్తించారు.
గత కొన్నేండ్లలో పలుమార్లు పాకిస్థాన్‌కు వెళ్లివచ్చాడని, ఈ సందర్భంగా కాస్మొటిక్స్, బట్టలు, సుగంధ ద్రవ్యాలను అక్రమంగా సరిహద్దులు దాటించాడని వెల్లడించారు. స్మగ్లింగ్ మాటున గూఢచర్యానికి పాల్పడినట్లు చెప్పారు. ఐఎస్ఐ ఏజెంట్లకు డబ్బుతోపాటు సిమ్‌కార్డులు కూడా అందించాడని దర్యాప్తులో తేలిందన్నారు. పాక్ నిఘా సంస్థ కోసం రిక్రూట్మెంట్ కూడా నిర్వహించాడని, ఇందులో భాగంగా యూపీలోని రామ్పూర్తోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారిని దాయాది దేశానికి పంపించినట్లు తెలిపారు. వీరికి వీసాలను ఐఎస్ఐ ఏజెంట్లు సమకూర్చాని చెప్పారు.
ఇప్పటికే ఇదే తరహా కేసులో ప్రముఖ యూట్యూబర్ స్వాతీ మల్హోత్రాను హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆమెతో ఒడిశాలోని పూరిలో ఉన్న ఓ యూట్యూబర్‌కు సంబంధాలున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూరి ఎస్పీ వినీత్ కథనం ప్రకారం, ‘ట్రావెల్ విత్ జో’ యూట్యూబ్ చానల్‌ను నడుపుతున్న జ్యోతి నిరుడు సెప్టెంబరులో పూరి వచ్చి, ఓ మహిళా యూట్యూబర్‌ను కలిసింది. పూరి మహిళ కూడా పాకిస్థానీ నిఘా వర్గాలకు మన దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఇచ్చిందా? అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జ్యోతిని పాక్ ఐఎస్ఐ ఏజెంట్లు ఒక అస్త్రంగా మలచుకున్నారని హర్యానా పోలీసులు గుర్తించారు.