లక్నో: ఒక రైతు నేత బీజేపీ ఎమ్మెల్యే చెంపపై కొట్టాడు. ఎందుకో అన్నది ఆ తర్వాత క్లారిటీ ఇచ్చాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఈ ఘటన జరిగింది. బుధవారం ఒక విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఉన్నావ్ బీజేపీ ఎమ్మెల్యే పంకజ్ గుప్తా పాల్గొన్నారు. ఇంతలో వేదికపైకి వచ్చిన స్థానిక వృద్ధ రైతు ఆ ఎమ్మెల్యే చెంపపై కొట్టాడు. దీంతో వేదికపై ఉన్న మిగతా నేతలు ఆ రైతును అక్కడి నుంచి తీసుకెళ్లారు.
కాగా, వైరల్ అయిన ఈ వీడియోపై యూపీలోని విపక్ష పార్టీలు తమదైన శైలిలో విమర్శలు చేశాయి. ‘ఈ చెంపదెబ్బ ఎమ్మెల్యే కోసం కాదు. బీజేపీ నేతృత్వంలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అనుసరిస్తున్న పేదల పట్ల వ్యతిరేక విధానాలు, పేలవమైన పాలన, నిరంకుశపాలన కోసం’ అంటూ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ విమర్శించింది.
మరోవైపు ఈ ఘటనపై ఆ వృద్ధ రైతు నేత, బీజేపీ ఎమ్మెల్యే పంకజ్ గుప్తా కలిసి శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. తాను ప్రేమ పూర్వకంగా ఎమ్మెల్యే చెంపను తాకేందుకు ప్రయత్నించానని ఆ రైతు చెప్పాడు. ‘నేను ఆయనను (ఎమ్మెల్యే)ను కొట్టలేదు. ఆయన దగ్గరికి వచ్చి ‘బేటా’ అని సంబోధిస్తూ ఏదో అడగబోయాను’ అని అన్నాడు.
బీజేపీ ఎమ్మెల్యే పంకజ్ గుప్తా కూడా ఈ వ్యవహారాన్ని తేలికపరిచేందుకు ప్రయత్నించారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి సమస్య లేదన్నారు. ఆ వృద్ధ రైతు తన తండ్రి లాంటి వారని, తన చెంపను తట్టేందుకు ఆయన ప్రయత్నించారని తెలిపారు. ఆ రైతు గతంలో కూడా ఇలా చేశారని అన్నారు. అయితే విపక్ష పార్టీలు రాజకీయ లబ్ధి కోసం దీనిని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా రైతులు ఉన్నారంటూ ప్రచారం చేయడమే వారి ఉద్దేశమంటూ మండిపడ్డారు.
….. farmer now claims he was lovingly waving his hand over the MLA and inadvertently hit him 😃 pic.twitter.com/4oFpUmciaF
— Alok Pandey (@alok_pandey) January 7, 2022