రాయ్‌పూర్: భార్య మైనర్ కాకపోతే ఆమె అనుమతి లేకుండా లైంగిక, అసహజ లైంగిక చర్యలు నేరం కాదని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. (Chhattisgarh High Court) అత్యాచారం, ఇతర ఆరోపణలపై కింది కోర్టు దోషిగా నిర్ధారించిన ఒక వ్యక్తిని నిర్దోషిగా పేర్కొంది. అతడ్ని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. 2017 డిసెంబర్ 11న బస్తర్ జిల్లాలోని జగదల్పూర్కు చెందిన వ్యక్తిపై అతడి భార్య పలు ఆరోపణలు చేసింది. తన అంగీకారం లేకుండా అసహజ శృంగారం చేశాడని, దీంతో కడుపులో నొప్పిగా ఉండటంతోపాటు అనారోగ్యం పాలైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరిస్థితి సీరియస్‌గా ఉన్న ఆమె ఎగ్జిక్యూటివ్ మెజిస్టేట్ ముందు ఈ మేరకు మరణ వాంగ్మూలం ఇచ్చింది. అనారోగ్యంతో అదే రోజు మరణించింది.
కాగా, ఆ మహిళ స్టేట్మెంట్ ఆధారంగా ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. 2019 ఫిబ్రవరి 11న జగదల్పూర్లోని అదనపు సెషన్స్ (ఫాస్ట్ ట్రాక్ కోర్టు) జడ్జి ఆ వ్యక్తిని దోషిగా నిర్ధారించారు. పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. దీంతో కోర్టు తీర్పును బిలాస్‌పూర్‌లోని హైకోర్టులో ఆ వ్యక్తి సవాల్ చేశాడు. అతడికి వ్యతిరేకంగా చట్టపరంగా ఆమోదయోగ్యమైన ఆధారాలు లేవని ఆ వ్యక్తి తరుపు న్యాయవాది కోర్టులో వాదించారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగానే దిగువ కోర్టు దోషిగా నిర్ధారించి జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
మరోవైపు ఆ మహిళ మొదటి ప్రసవం తర్వాత ఫైల్స్‌తో బాధపడుతున్నదని, దీని కారణంగా ఆమెకు రక్తస్రావం, కడుపులో నొప్పి వచ్చేదని న్యాయవాది కోర్టుకు చెప్పాడు. ఇద్దరు సాక్షుల వాంగ్మూలాలను ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. అయితే ఆ అప్పీల్‌ను తిరస్కరించాలని ప్రభుత్వం తరుఫు న్యాయవాది వాదించారు.
కాగా, ఐపీసీలోని 375, 376, 377 సెక్షన్లను హైకోర్టు పరిశీలించింది. 375 సెక్షన్‌కు సవరించిన నిర్వచనం దృష్ట్యా, భార్యాభర్తల మధ్య ఐపీసీ 377 సెక్షన్ కింద నేరానికి స్థానం లేదని, అలాంటి అత్యాచారాన్ని నిరూపించలేమని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది. అతడ్ని జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. గత ఏడాది నవంబర్ 19న రిజర్వ్ చేసిన ఈ తీర్పును ఫిబ్రవరి 10న జస్టిస్ నరేంద్ర కుమార్ వెలువరించారు.