Unnao case : ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తండ్రి కస్టోడియల్ డెత్ కేసులో దోషిగా తేలి 10 ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ సెంగర్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో పదేళ్ల శిక్షను నిలిపివేయాలంటూ దాఖలు చేసిన ఆయన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. శిక్షలో ఉపశమనం కల్పించేందుకు సరైన కారణాలు లేవని జస్టిస్ రవీందర్ పేర్కొన్నారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 3కు వాయిదా వేశారు.
ఉన్నావ్ అత్యాచారం కేసులో కుల్దీప్ సెంగర్ దోషిగా తేలి జీవితఖైదు అనుభవిస్తున్నారు. ఇటీవల ఈ శిక్షను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అంతేకాదు షరతులపై బెయిల్ కూడా ఇచ్చింది. అయితే.. ఈ తీర్పుపై సీబీఐ అధికారులు, బాధితురాలి తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో శిక్ష నిలిపివేతపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. కస్టడీ నుంచి విడుదల చేయవద్దని పోలీసుశాఖను ఆదేశించింది.
2017లో కుల్దీప్ సింగ్ సెంగర్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్ ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడ్డాడు. 2018 ఏప్రిల్‌లో ఆమె తండ్రి పోలీసు కస్టడీలో మృతిచెందాడు. 2019 ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అత్యాచారం కేసు, సంబంధిత ఇతర కేసులను ఉత్తరప్రదేశ్‌లోని ట్రయల్ కోర్టు నుంచి ఢిల్లీకి బదిలీ చేశారు. సెంగర్‌కు అత్యాచారం కేసులో జీవిత ఖైదు, బాధితురాలి తండ్రి మృతి కేసులో పదేళ్ల జైలుశిక్ష పడింది.