UNCCD | న్యూఢిల్లీ, డిసెంబర్ 9: వాతావరణ మార్పులు, గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల వల్ల భూగోళం క్రమంగా ఎడారిలా మారిపోతున్నట్టు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. పుడమిపై గత మూడు దశాబ్దాల్లో లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతాలు పొడి వాతావరణాన్ని అనుభవించాయని, అంతకుముందు గడిచిన మూడు దశాబ్దాలతో పోలిస్తే ఇది 77% ఎక్కువని సోమవారం విడుదల చేసిన తాజా నివేదికలో యూఎన్‌సీసీడీ (యూఎన్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్) పేర్కొన్నది.
ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా పొడి భూములు (డ్రైల్యాండ్స్) దాదాపు 43 లక్షల చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించాయని చెప్పింది. ప్రస్తుతం ప్రపంచంలోని మొత్తం భూమిలో డ్రైల్యాండ్స్ 40% శాతానికిపైగా ఉన్నట్టు తెలిపింది. సౌదీ అరేబియాలోని రియాద్‌లో యూఎన్‌సీసీడీ 16వ సమావేశం సందర్భంగా ఈ నివేదికను విడుదల చేశారు. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను నిరోధించడంలో మానవాళి విఫలమైతే ఈ శతాబ్దం చివరినాటికి ప్రపంచంలోని తేమ ప్రాంతాల్లో మరో 3% పొడి ప్రాంతాలుగా మారుతాయని యూఎన్‌సీసీడీ హెచ్చరించింది.