న్యూఢిల్లీ: సెకనుకు నాలుగు ఫుట్బాల్ మైదానాలతో సమానమైన సారవంతమైన భూమిని ప్రపంచం కోల్పోతున్నట్టు ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ ఆందోళన వ్యక్తంచేశారు. ఎడారీకరణ, కరువును ఎదుర్కోవడానికి గుర్తుగా జూన్ 17న జరుపుకొనే ప్రపంచ దినోత్సవానికి ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కోట్లాదిమంది ప్రజల భద్రత, శ్రేయస్సు, ఆరోగ్యం, జీవితాలు, జీవనోపాధి, పర్యావరణ వ్యవస్థ వంటివి అభివృద్ధి చెందుతున్న భూములపై ఆధారపడి ఉంటాయని గుటెరస్ పేర్కొన్నారు. కానీ, మనం మాత్రం మనల్ని నిలబెట్టే భూమిని నాశనం చేస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.