న్యూఢిల్లీ, ఆగస్టు 24: ఢిల్లీలోని టూలియన్స్ బంగ్లా జోన్లో ఉన్న కేంద్ర మంత్రుల అధికారిక నివాసాల పునరుద్ధరణ, ఫర్నీషింగ్, మరమ్మతుల కోసం 2025-26 వార్షిక వ్యయం రికార్డు స్థాయిలో రూ. 92.35 కోట్లకు పెరిగింది. 2014-15లో వెచ్చించిన రూ. 27.47 కోట్లతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. మరమ్మతులు, పునరుద్ధరణ, నిర్వహణ బాధ్యతలు చూసే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ద్వారా 2014-15, 2025-26 మధ్య ఈ పనుల కోసం ప్రభుత్వం రూ. 547.68 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానమిచ్చింది.
ద్రవ్యోల్బణం, మధ్య ఢిల్లీలోని విశాలమైన ప్రాంగణాల్లో విస్తరించి ఉన్న ఈ పాత భవనాల నిర్వహణ వ్యయం పెరగడం వంటి కారణాల వల్ల 2025-26 నాటి వ్యయం 2014 తర్వాత అత్యధికంగా మారిందని అధికారులు తెలిపారు.
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ప్రభుత్వ పాఠశాలల అవసరాలు వంటి సమస్యల నడుమ కేంద్ర మంత్రుల అధికారిక నివాసాల నిర్వహణ కోసం రూ. 92.35 కోట్లు ఖర్చు చేయడాన్ని కాంగ్రెస్, సీజేపీ, ఆప్ తప్పుబట్టాయి. ‘మీ విలాసవంతమైన ఇండ్లను బాగుచేయడం ఆపి పాఠశాలలను బాగుచేయండి’ అని సీజేపీ ఎక్స్ పోస్ట్‌లో వ్యాఖ్యానించింది. మంత్రుల భవనాల పునరుద్ధరణ, ఫర్నీషింగ్పై జరుగుతున్న అధిక వ్యయాన్ని కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్పర్సన్ సుప్రియా శ్రీనాథ్ విమర్శించారు.