హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : ఏపీ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. సోమవారం తిరుపతి నుంచి కృష్ణపట్నం వెళ్లేందుకు హెలికాప్టర్ ఎక్కిన తర్వాత అందులో సాంకేతిక లోపం ఉన్నట్టు తేలడంతో ఆయన పర్యటన రద్దయింది. ఏపీ సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటన సందర్భంగా ఈ హెలికాప్టర్ వాడుతుంటారు.
ఇదే హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తడం కలకలం రేపింది. హెలికాప్టర్లో సాంకేతిక లోపం కారణంగా కేంద్రమంత్రి తన పర్యటన రద్దు చేసుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిపోయారు. వీఐపీలు ప్రయాణించే హెలికాప్టర్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంపై అధికారులు అలర్ట్ అయ్యారు. హెలికాప్టర్ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఏపీ డీజీపీ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.