Toll Policy | కొత్త టోల్ పాలసీ విధానంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త టోల్‌తో ఇబ్బందులన్నీ తొలగిపోతాయన్నారు. కొత్తగా ప్రవేశపెట్టబోతున్న టోల్ విధానంలో శాటిలైట్ ట్రాకింగ్, వెహికిల్ నంబర్ ప్లేట్ గుర్తింపు తదితర సాంకేతికను సైతం ఉపయోగించనున్నట్లు ప్రకటించారు. దాంతో నేరుగా బ్యాంకు ఖాతా నుంచి టోల్ మొత్తం డెబిట్ అవుతుందని.. ఇక మాన్యువల్‌గా టోల్ వసూలు చేయాల్సిన అవసరం ఉండదన్నారు. ముంబయి దాదర్ ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
త్వరలోనే దేశవ్యాప్తంగా టోల్ బూత్‌లను తొలగిస్తామని పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం కొత్త టోల్ విధానంపై పనిచేస్తోందని, ఇది త్వరలో అమలు చేయబడుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం వివరాలన్నీ ఇప్పుడే చెప్పలేనని.. మరో 15 రోజుల్లో కొత్త టోల్ పాలసీని ప్రకటించనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత టోల్ సిస్టమ్‌పై ఫిర్యాదులు ఉండవచ్చన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంబయి-గోవా హైవే నిర్మాణ పనులు జూన్ వరకు పూర్తవుతాయన్నారు.
ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్న హైవే ఇదని.. పనులు పూర్తయితే ప్రజలకు, కొంకణ్ వైపు వెళ్లేవారికి ఎంతో ఉపశమనం కలుగుతుందన్నారు. దేశ మౌలిక సదుపాయాల మాట్లాడుతూ రాబోయే రెండేళ్లలో భారత రోడ్లు మెరుగ్గా మారుతాయని గడ్కరీ పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో హైవేలు, రోడ్నెట్వర్క్ మెరుగవడం చాలా కీలకమని.. ఈ దిశగా ప్రభుత్వం వేగంగా పని చేస్తుందన్నారు. ముంబయి-గోవా మధ్య నిర్మిస్తున్న జాతీయ రహదారి ఈ రెండు ప్రదేశాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని తెలిపారు. కొంకణ్ ప్రాంతంలో అభివృద్ధి వేగానికి కొత్త ఊపునిస్తుందని.. చాలా కాలంగా అసంపూర్తిగా ఉన్న ఈ ప్రాజెక్టును పూర్తి చేయడంలో అనేక అడ్డంకులు ఎదురయ్యాయన్నారు.
జూన్ నాటికి రోడ్డు నిర్మాణ పనులు వందశాతం పూర్తి చేస్తామన్నారు. భూసేకరణ, కోర్టు కేసులు, పరిహారం సంబంధిత సమస్యలపై వివాదాల కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయన్నారు. ప్రస్తుతం, వివాదాలన్నీ పరిష్కారమయ్యాయని.. పనులు ఊపందుకున్నాయన్నారు. దేశ మౌలిక సదుపాయాలలో ఉన్న సవాళ్లపై స్పందిస్తూ.. ఢిల్లీ-జైపూర్, ముంబయి-గోవా వంటి హైవేలు ఇప్పటికీ రోడ్లు రహదారులశాఖకు ‘బ్లాక్ స్పాట్స్’గా పేర్కొన్నారు. నిజాలు చెబితే ప్రజలు నమ్మకపోవచ్చునని వ్యాఖ్యానించారు.