Minister Giriraj Singh | పాట్నా, ఆగస్టు 4: కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్‌కు సొంత నియోజకవర్గమైన బీహార్‌లోని బెగుసరాయ్‌లో నిససన సెగ తగిలింది. స్థానిక దాక్ బంగ్లా రోడ్లో ఆదివారం ఓ పార్క్ శంకుస్థాపనకు వచ్చిన కేంద్ర మంత్రిని ఏఎన్ఎం కార్యకర్తలు ఘెరావ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆయన కారును చుట్టుముట్టి ఆందోళన చేపట్టారు. వారు తమ డిమాండ్లతో కూడిన ఒక వినతిపత్రాన్ని గిరిరాజ్ సింగ్‌కు ఇచ్చేందుకు ప్రయత్నించగా.. ఆయన వారిని పట్టించుకోకుండా, ఏం సమాధానం చెప్పకుండా నాటకీయ పరిణామాల మధ్య తన కాన్వాయ్‌ను దిగి ఆ ప్రాంతం నుంచి ఒక బైక్‌పై వెళ్లిపోయారు.
దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించాలనుకొన్నామని, అయితే కేంద్ర మంత్రి పట్టించుకోకుండా దారుణంగా వ్యవహరించారని ఏఎన్ఎం కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మెరుగైన సదుపాయాలు, వేతనాలు కల్పించాలన్న తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.