Raksha Khadse | జల్గావ్/ ముంబై, (నమస్తే తెలంగాణ) మార్చి 2: మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో తన కుమార్తెను, ఆమె స్నేహితులను కొందరు వ్యక్తులు వేధించారంటూ కేంద్ర మంత్రి, బీజేపీ నేత రక్షా ఖడ్సే ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించి ముక్తైనగర్ పోలీసుస్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్లో ఏడుగురు వ్యక్తులను నిందితులుగా పేర్కొనగా అందులో ఒకరిని శుభమ్ మాలిగా గుర్తించి అరెస్టు చేసినట్టు ముక్తైనగర్ పోలీసు స్టేషన్ అధికారి ఒకరు ఆదివారం వెల్లడించారు.
ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ నిందితులు ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన వారని వెల్లడించారు. ముక్తైనగర్లోని కొఠాలీ గ్రామంలో శుక్రవారం రాత్రి సంత్ ముక్తై యాత్రలో ఈ ఘటన జరిగినట్టు కేంద్ర మంత్రి ఖడ్సే ముక్తైనగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సొంత పార్టీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలో శాంతి భద్రతలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, నిందితుల్లో ఒకడైన పీయూష్ మోరే.. శివసేన షిండే వర్గానికి చెందినవాడుగా సమాచారం.
ఖడ్సే విలేకరులతో మాట్లాడుతూ తాను గుజరాత్లో ఉండగా తన కుమార్తె ఫోన్ చేసి యాత్రలో పాల్గొనడానికి అనుమతి కోరిందని చెప్పారు. ఒక గార్డును, ఇద్దరు, ముగ్గురు సిబ్బందిని తీసుకువెళ్లాలని తాను తన కుమార్తెకు సూచించానని ఆమె తెలిపారు. తన కుమార్తెతోపాటు ఆమె స్నేహితులను కూడా కొందరు ఆకతాయిలు అనుసరించడమేగాక తోశారని, అనుమతి లేకుండా వారి ఫొటోలు, వీడియోలను తీశారని ఆమె చెప్పారు. తన సిబ్బంది దీన్ని ప్రశ్నించగా వారిపైన కూడా ఆ పోకిరీలు దురుసుగా వ్యవహరించారని, దాదాపు 30 నుంచి 40 మంది అక్కడ గుమికూడారని మంత్రి చెప్పారు.
తాను ఈ రోజు ఉదయం ఇంటికి చేరుకోగా ఈ ఘటన గురించి తనకు తెలిపిందని, ఫిబ్రవరి 24న మరో కార్యక్రమంలో కూడా ఈ మగపిల్లల జట్టు తన పట్ల అమర్యాదగా ప్రవర్తించినట్టు తన కుమార్తె చెప్పిందని మంత్రి తెలిపారు. ఓ ఎంపీ లేదా కేంద్ర మంత్రి కుమార్తెకే ఈ విధమైన వేధింపులు ఎదురైతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు.
ఈ మగపిల్లల గుంపు స్కూలుకు వెళ్లే బాలికలను కూడా వేధిస్తున్నట్టు ముక్తైనగర్లోని స్థానికులు తన దృష్టికి తెచ్చారని ఆమె చెప్పారు. ఈ విషయమై తాను ముఖ్యమంత్రి, డీఎస్పీతో మాట్లాడానని ఖడ్సే చెప్పారు. ఈ ఘటనపై మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ స్పందిస్తూ మహాయుతి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దిగజారిపోయిందని ఆరోపించారు. మహిళలు, బాలికలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.