న్యూఢిల్లీ, మే 15: లోక్సభ ఎన్నికల వేళ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలును కేంద్రం ప్రారంభించింది. సీఏఏ అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారిగా 14 మందికి భారత పౌరసత్వం కల్పించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా వారికి బుధవారం ఢిల్లీలో పౌరసత్వ సర్టిఫికెట్లను అందజేశారు. సంబంధిత పోర్టల్లో ఆన్లైన్ దరఖాస్తులను ప్రాసెస్ చేసిన తర్వాత, ఈ సర్టిఫికెట్లను మంజూరు చేశామని హోంశాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. సీఏఏ అమలుపై ఈ ఏడాది మార్చిలో కేంద్రం నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. 2014, డిసెంబర్ 31 కంటే ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్ల నుంచి భారత్లోకి వచ్చిన ముస్లిమేతర(హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రిస్టియన్లు) వలసదారులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిందే సీఏఏ. 2019, డిసెంబర్లో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పార్లమెంట్లో ఆమోదింపజేసుకొన్న ఈ చట్టాన్ని విపక్ష పార్టీలు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ చట్టం ముస్లింల పట్ల వివక్ష చూపిస్తున్నదని విమర్శిస్తున్నారు.