బెంగాల్లో బీజేవైఎం నేత అర్జున్ చౌరాసియా అనుమానాస్పదంగా మరణించాడు. ఇది తృణమూల్ చేసిన హత్యేనని బీజేపీ ఆరోపిస్తోంది. పైగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బెంగాల్ పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ మరణం సంభవించిన నేపథ్యంలో… అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
కేంద్రహోంమంత్రి అమిత్‌షా మరణించిన బీజేవైఎం నేత అర్జున్ చౌరాసియా కుటుంబీకులను పరామర్శించారు. వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికార తృణమూల్‌పై తీవ్రంగా మండిపడ్డారు. ఇది తృణమూల్ స్టైల్ మర్డర్ అంటూ ఫైర్ అయ్యారు.
తృణమూల్ తిరిగి అధికారం చేజిక్కించుకొని సంవత్సరం పూర్తైంది. రాజకీయ హత్యలు ప్రారంభమయ్యాయి. బీజేవైఎం నేత అర్జున్ మర్డర్‌ను ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాన్ని నేను పరామర్శించా. వాళ్ల నానమ్మను కూడా కొట్టారు. ఈ విషయంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం అని అమిత్‌షా పేర్కొన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పశ్చిమ బెంగాల్ పర్యటన సందర్భంగా కోల్‌కతాలో ఆయనకు స్వాగతం పలికే బైక్ ర్యాలీని లీడ్ చేయాల్సిన బీజేపీ కార్యకర్త అనుమానాస్పదంగా మరణించాడు. కోల్‌కతాలోని చిత్పూర్-కాసిపోర్ ప్రాంతంలో 26 ఏళ్ల అర్జున్ చౌరాసియా అనే యువకుడు పాడుబడిన బిల్డింగ్‌లో సీలింగ్‌కు వేలాడుతూ శుక్రవారం కనిపించాడు. దీంతో తమ కార్యకర్తను అధికార టీఎంసీ హత్య చేసిందని బీజేపీ ఆరోపించింది. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని, మృతుడి కాళ్లు నేలకు తగులుతూ ఉండటమే దీనికి కారణమని పేర్కొంది.