Union Cabinet | కేంద్ర కేబినెట్ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన స్కీమ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.24వేల కోట్లతో పథకం అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. పునరుత్పాదక ఇంధనంలో పెట్టుబడి పెట్టేందుకు ఎన్ఎల్సీఐఎల్ ప్రభుత్వం రూ.7వేల కోట్లు, ఎన్టీపీసీ కోసం రూ.20వేల కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదించింది. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన స్కీమ్ ద్వార ఇప్పటికే ఉన్న 36 పథకాలను ఏకీకృతం చేస్తుందన్నారు. పంటల వైవిధ్యం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి వివరిస్తూ.. ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన పంటకోత తర్వాత నిల్వను పెంచుతుందన్నారు. నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరుస్తుందన్నారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుందని.. ఈ కార్యక్రమం ద్వారా 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి జరుగుతుందని ఆయన వివరించారు.