Union Cabinet : కేంద్ర క్యాబినెట్ (Union Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్త కులగణన (Caste census) కు ఆమోదం తెలిపింది. జనాభా లెక్కలతోపాటే కులగణన చేపట్టాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. పహల్గాం ఉగ్రదాడిపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌పై చర్చించేందుకు ఇవాళ రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (Cabinet Committee on Political Affairs – CCPA) సమావేశమైందని, ఈ సందర్భంగా వచ్చే జనాభా లెక్కలతోపాటే కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు కులగణన చేపట్టాయని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వాటిలో కొన్ని రాష్ట్రాలు రాజకీయ సాధనంగా కులగణనను వాడుకున్నాయని ఆయన ఆరోపించారు. కాగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తం కులగణన చేపట్టాలంటూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఆ డిమాండ్లను ఇన్ని రోజులుగా కేంద్రం పక్కన పెడుతూ వస్తున్నది. ఈ క్రమంలో ఇవాళ కులగణనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలుపడం సంచలనంగా మారింది.