Union Budget : కొబ్బరి ఉత్పత్తిని పెంచడం కోసం కొబ్బరి ప్రోత్సాహక పథకాన్ని తీసుకొచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ చెప్పారు. లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆమె ఈ విషయం వెల్లడించారు. మొత్తం 500 రిజర్వాయర్లలో చేపల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
పశుసంవర్ధక శాఖలో భారీగా ప్రోత్సహకాలు అందించనున్నట్లు తెలిపారు. వ్యవసాయ ఆదాయం పెంచేందుకు అధిక విలువ పంటలకు ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు చెప్పారు.
తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇస్తామని నిర్మలాసీతారామన్ తెలిపారు. కాయలుకాయని కొబ్బరి చెట్ల స్థానంలో కొత్త చెట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. జీడిపప్పు, కోకో ఉత్పత్తి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. గంధం చెట్ల వనాలు, బాదం, పైన్‌నట్స్ కోసం ప్రత్యేక పథకం తీసుకురానున్నట్లు వెల్లడించారు. దేశీయ జల రవాణాలో ఆధునిక విధానాలు అమలు చేయనున్నట్లు తెలిపారు.
మౌలిక సదుపాయాల రంగంలో పనిచేసే కూలీలకు ఉపయోగపడేలా నిధులు కేటాయిస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. పారిశ్రామిక క్లస్టర్ల పునరుద్ధరణ చేయనున్నట్లు తెలిపారు. పులికాట్లో పక్షులను వీక్షించేందుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తామన్నారు. టైక్స్‌టైల్ రంగం కోసం 5 సూత్రాలతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. టైక్స్‌టైల్ రంగం కోసం వచ్చే ఐదేళ్లకు రూ.10 వేల కోట్లు కేటాయించారు. 15 పురావస్తు ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆతిథ్యరంగంలో జాతీయ సంస్థ ఏర్పాటు చేస్తామన్నారు. 20 పర్యాటక ప్రాంతాల్లో పదివేల గైడ్ల నియామకం చేపట్టనున్నట్లు తెలిపారు.
సూక్ష్మతరహా పరిశ్రమలకు రూ.2 వేల కోట్లు కేటాయించారు. స్వయం సమృద్ధ భారతం పేరుతో రూ.2 వేల కోట్ల ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు. దేశంలో మూడు ఆయుర్వేద ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.