Union Budget | రైతులకు ఇచ్చే కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న రూ.3లక్షల పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచినట్లు చెప్పారు.
రైతుల కోసం ప్రత్యేకంగా ప్రధాన మంత్రి ధన్ధాన్య కృషి యోజన పథకాన్ని నిర్మలాసీతారామన్ ప్రకటించారు. ఈ పథకంతో 1.7 కోట్ల మంది రైతులకు లబ్ది చేకూరనందని ఆమె పేర్కొన్నారు. దేశంలో వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి దీని ద్వారా ప్రోత్సాహం అందించనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే గోడౌన్లు, నీటి పారుదల, రుణ సదుపాయాలు కల్పించనున్నారు.
పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకాన్ని తీసుకొచ్చామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగా కంది, మినుములు, మసూర్ పప్పు కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. అలాగే పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం తీసుకొస్తున్నామని చెప్పారు.