న్యూఢిల్లీ: ఎర్ర సముద్రంలో ఇప్పటివరకు ఓడలమీద దాడికే పరిమితమైన హౌతీలు ఇప్పుడు ప్రపంచాన్నే వణికించే చర్యను చేపట్టారా? అంటే అవుననే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థలకు ఆయువుపట్టుగా ఉన్న సముద్రగర్భ కేబుల్స్‌పై హౌతీలు గురిపెట్టారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
సముద్రంలోని నాలుగు ప్రధాన కేబుల్ వ్యవస్థలను వీరు కట్ చేసినట్టు సోమవారం నిర్ధారణ అయ్యింది. వీరి దుశ్చర్య కారణంగా ఆసియా, యూరప్, మధ్యప్రాచ్య దేశాల మధ్య ఇంటర్నెట్, కమ్యూనికేషన్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదం ఏర్పడింది. ముఖ్యంగా నాలుగు ప్రధాన టెలికం నెట్‌వర్క్‌లను వీరు కత్తిరించారని తెలిసింది. సముద్రగర్భ కేబుల్ వ్యవస్థను కట్ చేసినట్టు వస్తున్న వార్తలను హౌతీలు ఖండించారు.