Layoffs | న్యూఢిల్లీ, అక్టోబర్ 17: సోషల్ మీడియా దిగ్గజ సంస్థ మెటా.. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సహా వివిధ టీమ్‌ల నుంచి పలువురు ఉద్యోగులను తొలగించినట్టు గురువారం కొన్ని నివేదికలు వెల్లడించాయి. కంపెనీ పునర్నిర్మాణంలో భాగంగా ఈ కోతలు చేపట్టినట్టు తెలుస్తున్నది. అయితే తాజాగా ఎంతమంది ఉద్యోగులను తొలగించారనే విషయాన్ని మెటా వెంటనే వెల్లడించలేదు.
ఈ కోతల వల్ల కంపెనీలోని వివిధ టీమ్‌లు ప్రభావితమవుతాయని టెక్ క్రంచ్ నివేదిక తెలిపింది. దీర్ఘకాల వ్యూహాత్మక లక్ష్యాల కోసం కొన్ని టీముల్లో మార్పులు చేస్తున్నట్టు మెటా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారికి వేరే అవకాశాలను చూపించడానికి తాము తీవ్రంగా శ్రమిస్తున్నట్టు చెప్పారు. తమను ఉద్యోగం నుంచి తొలగించారని పలువురు మెటా ఉద్యోగులు సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. ఈ ఏడాది ప్రారంభంలో మెటా తన రియాల్టీ ల్యాబ్స్ విభాగం ఉద్యోగులను తొలగించింది.
ఇంటెల్‌లో 2 వేల ఉద్యోగులపై వేటు!
ఆగస్టులో ప్రకటించిన ఉద్యోగాల కోతను అమలు చేస్తున్నట్టు ఇంటెల్ సంస్థ తెలిపింది. దీని వల్ల అమెరికా వ్యాప్తంగా 2 వేల మంది ఉద్యోగులపై ప్రభావం పడనుంది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా శ్రామిక శక్తిని తగ్గిస్తున్నట్టు ఆ సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 15 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ఇంటెల్ సీఈవో పాట్ గెల్సింగర్ ఆగస్టులో చేసిన ప్రకటన ప్రకారం భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాల కోతలు ఉండనున్నాయి.
నోకియాలోనూ భారీగా తొలగింపులు
మొబైల్, స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ‘నోకియా’ పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతకు తెరలేపింది. చైనాలోని వివిధ కార్యాలయాలు, ప్లాంట్లలో పనిచేస్తున్న దాదాపు 2వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. అలాగే, యూరప్‌లో మరో 350 ఉద్యోగాలకు లేఆఫ్ ప్రకటించేందుకు సిద్ధమైంది. కంపెనీ లాభాల మార్జిన్ పెంచుకోవటంపై దృష్టిపెట్టిన ‘నోకియా’, ఉద్యోగుల జీతభత్యాల భారాన్ని తగ్గించుకునే చర్యల్ని చేపట్టినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఇక యూరప్‌లో 350మంది తొలగింపుపై సంప్రదింపులు మొదలయ్యాయని నోకియా అధికార ప్రతినిధి స్వయంగా తెలిపారు. వ్యయ నియంత్రణలో భాగంగా నోకియా గత ఏడాది 14 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తం ఉద్యోగుల సంఖ్యను 86 వేల నుంచి 72వేలకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.