న్యూఢిల్లీ, ఆగస్టు 27: రాజ్యసభకు 12 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో తొమ్మిది మంది బీజేపీ సభ్యులు కాగా, ఎన్డీఏ మిత్రపక్షాలైన ఎన్సీపీ(అజిత్ పవార్) నుంచి ఒకరు, రాష్ట్రీయ లోక్‌మంచ్ నుంచి ఒకరు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఒకరు ఎన్నికయ్యారు. బీజేపీ తరపున అస్సాం నుంచి మిషన్ రంజన్ దాస్, రామేశ్వర్ తేలి, బీహార్ నుంచి మనన్ కుమార్ మిశ్రా, హర్యానా నుంచి కిరణ్ చౌదరి, మధ్యప్రదేశ్ నుంచి జార్జ్ కురియన్, మహారాష్ట్ర నుంచి ధైర్యశీల్ పాటిల్, ఒడిశా నుంచి మమతా మహంత, రాజస్థాన్ నుంచి రవ్నీత్ సింగ్ బిట్టు, త్రిపుర నుంచి రాజీవ్ భట్టాచార్య రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ తరపున తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్వి, ఎన్సీపీ తరపున మహారాష్ట్ర నుంచి నితిన్ పాటిల్, ఆర్ఎల్ఎం తరపున బీహార్ నుంచి ఉపేంద్ర కుశ్వాహ ఏకగ్రీవంగా గెలుపొందారు. 245 స్థానాలుండే రాజ్యసభలో ప్రస్తుతం 237 మంది సభ్యులు ఉన్నారు. మెజారిటీ సాధించడానికి 119 సభ్యులు అవసరం. కొత్త సభ్యుల ఎన్నికతో బీజేపీ బలం 96కు, ఎన్డీఏ బలం 121కు చేరడంతో మెజారిటీ మార్కును అందుకుంది. ప్రతిపక్ష పార్టీల రాజ్యసభ సభ్యుల సంఖ్య 85గా ఉంది.
క్యాబ్ కోసం 500 పంపండి
సీజేఐ పేరుతో సైబర్ మోసగాడి మెసేజ్
న్యూఢిల్లీ: ప్రముఖుల ఫొటోలను డీపీగా పెట్టుకొని, వారిలా చాట్ చేస్తూ డబ్బులు అడిగే సైబర్ మోసగాళ్లు హద్దు మీరిపోతున్నారు. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ పేరుతోనే డబ్బులు అడుగుతున్న వైనం బయటకు వచ్చింది. ‘ఎక్స్’లో ఓ నెటిజన్ ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్ షేర్ చేశారు. ‘నేను సీజేఐని. అత్యవసరంగా కొలీజియం సమావేశానికి వెళ్తుండగా కన్నాట్ ప్లేస్‌లో ఇరుక్కుపోయాను. క్యాబ్ కోసం రూ.500 పంపగలరా ? కోర్టుకు చేరుకున్న తర్వాత తిరిగి పంపిస్తా’ అంటూ మోసగాడు చాట్ చేశాడు. ఇది సీజేఐ దృష్టికి వెళ్లడంతో సుప్రీంకోర్టు సిబ్బంది సైబర్ నేరాల విభాగానికి ఫిర్యాదు చేశారు.
ఐఎంఏ చీఫ్ క్షమాపణను అంగీకరించని సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఐఎంఏ చీఫ్ అశోకన్ చెప్పిన బేషరతు క్షమాపణను అంగీకరించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. పతంజలి సంస్థపై ఐఎంఏ దాఖలు చేసిన కేసు విచారణ సమయంలో అశోకన్ ఏప్రిల్ 29న సుప్రీంకోర్టును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వార్తాపత్రికల్లో ప్రచురించిన క్షమాపణ ప్రకటన చాలా చిన్నగా ఉండటంతో కోర్టు తిరస్కరించింది.