న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్‌కు కర్కర్దూమా కోర్టు గురువారం బెయిల్ నిరాకరించింది. 2020లో జరిగిన ఈశాన్య ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన కేసులో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (JNU) మాజీ సభ్యుడు ఉమర్ ఖలీద్‌ను ఉగ్రవాద నిరోధక చట్టం చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో జేఎన్‌యూ మాజీ విద్యార్థి, కార్యకర్త ఉమర్ ఖలీద్‌ను సెప్టెంబర్ 14, 2020న అరెస్టు చేయగా.. ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉంటున్నాడు.
బెయిల్‌పై విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది వాదనలు విన్న తర్వాత అదనపు సెషన్స్ జడ్జి అమితాబ్ రావత్ ఈ నెల 3న తీర్పును రిజర్వ్ చేశారు. వాదన సందర్భంగా తనపై కేసును నిరూపించడానికి ప్రాసిక్యూషన్ వద్ద ఆధారాలు లేవని ఉమర్ ఖలీద్ కోర్టుకు తెలిపాడు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ కట్టుకథ అని, రెండు టీవీ చానెల్స్ చేసిన వీడియో క్లిప్‌ల ఆధారంగా కేసు నమోదు చేసినట్లు ఉమర్ ఖలీద్ తరఫు న్యాయవాది వాదించారు.
దేశ రాజధాని ఢిల్లీలో 2020, ఫిబ్రవరిలో సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా జరిగిన నిరసన తర్వాత 72 గంటల పాటు హింస చోటు చేసుకోగా.. 53 మంది ప్రాణాలు కోల్పోగా.. 700 మందికిపైగా గాయపడ్డ విషయం తెలిసిందే. అల్లర్ల కేసులో 18 మందిని నిందితులుగా పేర్కొనగా.. ఇప్పటి వరకు ఆరుగురికి మాత్రమే బెయిల్ మంజూరైంది. ఈ కేసులో ఉమర్ ఖలీద్, కార్యకర్త ఖలీద్ సైఫీ, జేఎన్‌యూ విద్యార్థులు నటాషా నర్వాల్, దేవాంగనా కలిత, జామియా కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు సఫూరా జర్గర్, ఆప్ మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌తో పాటు పలువురిపై కూడా కఠిన చట్టం కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.