ULFA (I) Commander : యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం – ఇండిపెండెంట్ (ULFA-I) ఆపరేషనల్ కమాండర్ రూపమ్ అసోమ్ (Rupam Asom) అరెస్టయ్యాడు. అసోం పోలీసులు, అసోం రైఫిల్స్, మిలిటరీ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టి అతడిని అరెస్ట్ చేశారు. అసోం – అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతం సమీపంలో రూపమ్ అసోమ్ పట్టుబడ్డాడు. ఈ విషయాన్ని తీన్సుకుయా జిల్లా సూపరింటెడెంట్ ఆఫ్ పోలీస్ అభిజిత్ గౌరవ్ వెల్లడించారు.
రూపమ్ అసోమ్ పట్టుబడటంతో రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో మిలిటెంట్ కార్యకలాపాలకు అడ్డుకట్ట పడినట్టేనని పోలీసులు చెబుతున్నారు. అసోమ్ జాడ కోసం గత ఐదు నెలలుగా నిఘా ఉంచామని, తీన్సుకుయా జిల్లా మార్గెరిటా ఏరియాలో అతని కదలికలు ఉన్నట్టు నిర్దిష్ట ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో శనివారం సాయంత్రం 4 గంటలకు సంయుక్త ఆపరేషన్ జరిపి పట్టుకున్నట్టు అభిజిత్ గౌరవ్ చెప్పారు. అతడి నుంచి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అసోంలోని పలు ప్రాంతాల్లో బలవంతపు వసూళ్ల రాకెట్ నడుపుతున్న రూపమ్ ఆసోమ్ కదలికలపై కొద్ది నెలలుగా పోలీసు బృందాలు నిఘా ఉంచాయి. 2018లో బోర్డుమ్సా పోలీస్ స్టేషన్ ఇన్చార్జి భాస్కర్ కలిత హత్య కేసుతో సహా పలు నేరసబంధిత కార్యకలాపాల్లో ఆయన ప్రమేయం ఉంది. కలిత హత్య కేసుపై ఎన్ఐఏ ఛార్జిషీట్లోనూ రూపమ్ అసోమ్ పేరు ఉంది. రూపమ్ అసోమ్ పట్టుబడటంతో ఆ ప్రాంతంలో క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉల్ఫా(ఐ) కి చెందిన మరి కొందరి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.