Aadhaar Update | చిన్న పిల్లల ఆధార్ కార్డుల అప్డేషన్ విషయంలో తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లలను స్కూల్లో చేర్పించే సమయంలో బాల ఆధార్ కార్డులు తీసుకుంటున్నారు. కానీ వారికి ఐదేళ్లు దాటిన తర్వాత ఆధార్ కార్డు అప్డేషన్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇలా ఐదేళ్ల వయసు దాటిన తర్వాత ఆధార్ కార్డు అప్డేషన్ చేయించుకోని చిన్నారులు దేశవ్యాప్తంగా ఏడు కోట్ల మందికిపైగా ఉన్నట్లు యూఐడీఏఐ తాజాగా వెల్లడించింది. అలాంటి వారికోసం యూఐడీఏఐ కొత్త వెసులుబాటు తీసుకొస్తోంది. పిల్లలు చదువుకునే స్కూళ్లలోనే ఆధార్ అప్డేషన్ చేసే విధంగా ఒక ప్రాజెక్టును ప్రారంభించినట్లు యూఐడీఏఐ సీఈవో భువనేశ్ కుమార్ తెలిపారు.
అనేక ప్రభుత్వ పథకాల అమలులో ఆధార్ కార్డు కీలకమని.. ప్రతి చిన్నారికి అవసరమైన ప్రయోజనాలు సమయానికి అందాలంటే ఇది తప్పనిసరి అని భువనేశ్ కుమార్ తెలిపారు. అందుకే పాఠశాలల ద్వారా ఈ ఆధార్ కార్డు అప్డేషన్ ప్రక్రియను సులువుగా పూర్తి చేయాలని అనుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కింద ప్రతి జిల్లాకు బయోమెట్రిక్ మెషిన్లను పంపించి, ప్రతి పాఠశాలలో ఆధార్ అప్డేషన్ ప్రక్రియను అమలు చేయనున్నట్లు చెప్పారు. ప్రతి స్కూల్‌కు వెళ్లి ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ చేసేందుకు కావాల్సిన టెక్నాలజీని పరీక్షిస్తున్నామని.. మరో 45 నుంచి 60 రోజుల్లో ఇది సిద్ధమవుతుందని పేర్కొన్నారు.
ఆధార్ కార్డులో తప్పులు దొర్లకుండా ఉండాలంటే నిర్దిష్ట సమయానికి ఎంబీయూ(mandate biometric update) తప్పనిసరి. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఐదేళ్ల వయసు దాటిన తర్వాత ఒకసారి ఆధార్ కార్డు అప్డేట్ చేయించాల్సి ఉంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏడేళ్ల వయసు వచ్చే వరకు కూడా ఎంబీయూ పూర్తి చేయకపోతే ఆధార్ డీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే నిర్దిష్ట సమయంలో ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోవాలి. 5 నుంచి 7 ఏళ్ల మధ్య చిన్నారులకు అప్డేషన్ కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఏడేళ్లు దాటితే మాత్రం రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఇక 15 ఏళ్లు పూర్తయిన తర్వాత కూడా ఆధార్‌కు రెండోసారి ఎంబీయూ తప్పనిసరి. ఈ నేపథ్యంలో 15 ఏళ్లు పూర్తయిన పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ కోసం కూడా ఇదే విధానాన్ని స్కూళ్లు, కాలేజీల ద్వారా అమలు చేయాలని అనుకుంటున్నట్లుగా భువనేశ్ కుమార్ తెలిపారు.