న్యూఢిల్లీ, అక్టోబర్ 7: పీహెచ్డీ పరిశోధనల్లో నాణ్యతను ప్రోత్సహించేందుకు ప్రతిఏటా పీహెచ్డీ ఎక్స్లెన్స్ సైటేషన్ పురస్కారాలను అందించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నిర్ణయించింది. పరిశోధనలకు అనుకూల వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు, నాణ్యమైన పరిశోధనలు చేసే యువ రిసెర్చ్ స్కాలర్లకు తగు గుర్తింపు ఇచ్చేందుకు ఈ పురస్కారాలను అందించనుంది. సైన్సెస్, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, సోషల్ సైన్సెస్, భారతీయ భాషలు, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్టుల్లో అవార్డులను అందించనుంది. దేశంలోని కేంద్ర, రాష్ట్ర యూనివర్సిటీలతో పాటు ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీల్లో పీహెచ్డీ చేసిన వారు ఈ పురస్కారాలకు దరఖాస్తు చేయొచ్చు. ప్రతియేటా ఒక్కో సబ్జెక్టు నుంచి రెండు చొప్పున 10 పురస్కారాలను అందించనున్నారు. ఇందుకోసం యూనివర్సిటీలే ఒక్కో సబ్జెక్ట్ నుంచి ఒక్కొటి చొప్పున ఐదు నామినేషన్లను పంపించవచ్చు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం రోజు పురస్కారాలను అందిస్తారు.