న్యూఢిల్లీ, జూలై 16: రాబోయే ఐదేండ్లలో భారతీయ భాషల్లో 22 వేల పుస్తకాల్ని తీసుకొచ్చేందుకు యూజీసీ, కేంద్ర విద్యాశాఖ సంయుక్తంగా ఓ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాయి. అనువాదం, అకడమిక్ రైటింగ్ ద్వారా భారతీయ భాషల్లో ఉన్నత విద్యకు సంబంధించిన స్టడీ మెటీరియల్స్‌ను తీసుకురావటమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ చెప్పారు.
ప్రతి భాషలో 1000 పుస్తకాల్ని రూపొందిస్తూ, ఐదేండ్లలో మొత్తం 22 భాషల్లో 22 వేల పుస్తకాలు తీసుకొస్తామని అన్నారు. కేంద్ర కార్యదర్శి సంజయ్ మూర్తి చేతులమీదుగా ప్రాజెక్ట్ ‘అస్మిత’ (అగ్మెంటింగ్ స్టడీ మెటీరియల్స్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్ థ్రూ ట్రాన్స్లేషన్, అకడమిక్ రైటింగ్)ను ప్రారంభించినట్టు ఆయన చెప్పారు.