చెన్నై : వీసీకే అధినేత, సీఎం విజయ్ మైనారిటీ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై డీఎంకే నాయకుడు, యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఉదయనిధి మాట్లాడుతూ..డీఎంకే కార్యకర్తల మద్దతు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నాయకత్వంతో సీట్లు గెలుచుకున్నప్పటికీ కాంగ్రెస్ నాయకులలో కనీస కృతజ్ఞత, మర్యాద కూడా లేదని మండిపడ్డారు. అధికారం కోసం పార్టీని నమ్మించి వెన్నుపోటు పొడిచే కాంగ్రెస్‌ను డీఎంకే క్యాడర్ ఎప్పటికీ నమ్మకూడదని, వారిని దరిదాపుల్లోకి కూడా రానివ్వొద్దని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ఐదుగురు ఎమ్మెల్యేలను గెలవడానికి డీఎంకే కార్యకర్తలే కారణమన్నారు. ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకున్నందుకే వారికి ఓటు వేశారు. కానీ ఈరోజు, కొన్ని పదవుల కోసం, మాకు సమాచారం ఇవ్వకుండా వారు పారిపోయారు. తమిళనాడు ప్రజలు వారికి అతి త్వరలోనే తగిన గుణపాఠం నేర్పిస్తారన్నారు. భారతదేశవ్యాప్తంగా బీజేపీ ఎదుగుదలకు కాంగ్రెస్సే కారణమని కూడా ఆయన ఆరోపించారు.
ఇన్నాళ్లు మోదీ, అమిషా వళ్ల కాంగ్రెస్ ఓడిపోయింది అనుకున్నామని కానీ, నేటి పరిస్థితులు చూస్తుంటే కేవలం కాంగ్రెస్ మోసపూరిత విధానాల వల్లే దేశంలో బీజేపీ గెలుస్తుందన్నారు. గతంలో కాంగ్రెస్ గెలిచిన సీట్లు కూడా కేవలం స్టాలిన్ పెట్టిన భిక్షేనని గుర్తు చేశారు. జెన్ జెడ్ యూత్‌కు రాజకీయంగా అవగాహన కల్పించాలన్నారు. అలాగే తొలిసారి ఓటు వేసిన వారికి కూడా రాజకీయ చైతన్యం కల్పించాలని డీఎంకే యువజన విభాగం నేతలకు సూచించారు.