Mumbai Airport : ముంబై విమానాశ్రయం (Mumbai Airport) నుంచి బయలుదేరే అంతర్జాతీయ విమానాలలో ఎకానమీ, బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు వేర్వేరు యూజర్ డెవలప్మెంట్ ఫీజుల (UDF) ను ఎయిర్‌పోర్ట్స్ ఎకానమిక్ రెగ్యులేటరీ అథారిటీ (AERA) సవరించింది. ముంబై నుంచి బయలుదేరే దేశీయ ప్రయాణికులకు చార్జీలను రూ.175 గా నిర్ణయించింది. సవరించిన టారిఫ్‌లను 2025 మే 16 నుంచి 2029 మార్చి 31 వరకు అమలు చేయనుంది.
అంతర్జాతీయ ప్రయాణికులకు సంబంధించి.. ఎకానమీ, బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు వేర్వేరు UDF లను ప్రవేశపెట్టింది. ఎకానమీ క్లాస్‌లో అంతర్జాతీయ ప్రయాణికుడికి UDF లను రూ. 615 గా, బిజినెస్ క్లాస్‌లో అంతర్జాతీయ ప్రయాణికుడికి రూ.695గా నిర్ణయించింది. విమానయాన సంస్థల ల్యాండింగ్, పార్కింగ్ చార్జీలను కూడా క్రమబద్దీకరించారు. పోటీగా ఉన్న ఇతర విమానాశ్రయాల చార్జీలను పరిగణనలోకి తీసుకుని ఈ రేట్లను నిర్ణయించారు.
AERA ప్రకారం.. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్(CSMI) విమానాశ్రయంలో మొత్తం ప్రయాణికుల విమాన ట్రాఫిక్‌లో 75 శాతం ఉన్న దేశీయ విమాన ప్రయాణికులకు UDF నామమాత్రంగా రూ.175గా నిర్ణయించారు. CSMI విమానాశ్రయాన్ని అదానీ గ్రూప్ నేతృత్వంలోని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (MIAL) నిర్వహిస్తున్నది.