ముంబై: మహారాష్ట్రకు చెందిన శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే మరోసారి కలుసుకున్నారు. కజిన్ సోదరులైన వీరిద్దరూ ఒక పెళ్లి వేడుకలో కలిసి మాట్లాడుకున్నారు. (Reunion Buzz) ఆదివారం ముంబైలోని అంధేరీలో జరిగిన ప్రభుత్వ అధికారి మహేంద్ర కళ్యాణ్కర్ కుమారుడి వివాహానికి వారిద్దరూ హాజరయ్యారు. ఉద్ధవ్ ఠాక్రే, ఆయన భార్య రష్మిని రాజ్ ఠాక్రే కలిశారు. అక్కడ కొంతసేపు వారు మాట్లాడుకున్నారు. ఇటీవల పెళ్లి వేడుకల్లో వీరు కలుసుకోవడం ఇది మూడోసారి.
కాగా, మహారాష్ట్రలోని అధికార మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటముల్లో విభేదాలు తలెత్తుతున్నాయి. దీంతో ఆయా కూటములు చీలిపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన (యూబీటీ), ఎంఎన్ఎస్ తమ విభేదాలను పరిష్కరించుకునేందుకు నిర్ణయించుకున్నాయని, రాజకీయంగా విడిపోయిన దాయాది సోదరులైన ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే తిరిగి కలుస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.
మరోవైపు 2005లో శివసేన నుంచి బయటకు వచ్చిన రాజ్ ఠాక్రే ఏడాది తర్వాత సొంత పార్టీ ఎంఎన్ఎస్ను ఏర్పాటు చేశారు. గత ఏడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష ఎంవీఏలో భాగమైన శివసేన (యూబీటీ) 20 సీట్లు గెలుచుకున్నది. అయితే ఎంఎన్ఎస్ ఒక్క సీటు కూడా గెలువలేకపోయింది. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన రాజ్ ఠాక్రే కుమారుడు కూడా ఓడిపోయాడు. అయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసికట్టుగా పోటీ చేయవచ్చని తెలుస్తున్నది.